అమీన్ పూర్ ఘటన: విష ప్రయోగమా.. ఫుడ్​పాయిజనా?

అమీన్ పూర్ ఘటన:  విష ప్రయోగమా.. ఫుడ్​పాయిజనా?
  • అనుమానాస్పద స్థితిలో ముగ్గురు చిన్నారులు మృతి
  • చికిత్సపొందుతున్న తల్లి
  • రాత్రి పెరుగన్నం తిని పడుకున్న తల్లి, పిల్లలు 
  • విష ప్రయోగమా.. ఫుడ్​పాయిజనా?
  • సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో ఘటన

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చిన్నారుల తల్లి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ మరణాలు సంభవించాయా? లేక పిల్లలకు విషమిచ్చి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమీన్​పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్​లావణ్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. చెన్నయ్య స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామం కాగా అమీన్​పూర్​ కు వచ్చి వాటర్​ ట్యాంకర్​నడుపుకుంటున్నాడు.  లావణ్య స్థానికంగా ఓ ప్రైవేట్​ స్కూల్లో టీచర్​గా పనిచేస్తోంది. గురువారం రాత్రి చెన్నయ్య పిల్లలు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్​(8), భార్య లావణ్యతో కలిసి భోజనం చేశాడు. 

భార్య, పిల్లలు పెరుగన్నం తిన్నారని, తాను మాత్రం పప్పుతో తిని చందానగర్​కు వాటర్​ ట్యాంకర్​తీసుకెళ్లినట్టు చెన్నయ్య తెలిపాడు. పని ముగించుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చి పడుకున్నానని చెప్పాడు. అయితే, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన భార్య లావణ్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని, వెంటనే పొరుగు వారి సహకారంతో బీరంగూడలోని ఓ హాస్పిటల్​కు తరలించానని పోలీసులకు తెలిపాడు. అనంతరం పిల్లలను పరిశీలించగా వారు విగత జీవులుగా పడి ఉన్నారని, లేపి చూడగా అప్పటికే చనిపోయారని చెప్పాడు. స్థానికులు అమీన్​పూర్​పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నరేశ్​తన సిబ్బందితో స్పాట్ కు చేరుకొని విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ రవీందర్​ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్​ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మరణాలుగా కేసును నమోదు చేశామని, చిన్నారుల మృతదేహాలకు పోస్ట్​మార్టం నిర్వహించిన తరువాత మరణాలకు కారణాలు తెలుస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. లావణ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమె వద్ద నుంచి కూడా పలు వివరాలు తీసుకున్నామని చెప్పారు. విష ప్రయోగం జరిగినట్లు కనిపిస్తోందని, అన్ని కోణాల్లో విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు. 

మరణాలపై అనుమానాలెన్నో.. 

చిన్నారుల మరణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. చెన్నయ్య, ఆయన భార్య లావణ్య తరచూ గొడవ పడుతున్నారని లావణ్య తల్లి భారతమ్మ తెలిపారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడని, ఆమె పేరుపై కొంత భూమి కూడా రిజిస్ట్రేషన్​చేశాడని చెప్పారు. గతంలో రెండు మూడు సార్లు గొడవలు జరిగినప్పడు పిల్లలను చంపి తానూ చనిపోతానని లావణ్య.. భర్త చెన్నయ్యను బెదిరించినట్లు బంధువులు చెప్పుకుంటున్నారు. దీంతో లావణ్యనే పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నయ్య ఇంట్లో లేనప్పుడు మరణాలు జరగడంతో ఆయన మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమీన్​పూర్​ పోలీసులు చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.