తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపక్కన పడి.. ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ ఆర్తనాదాలు
పట్టించుకునే దిక్కు లేకపోవడంతో పెనుగులాడి తుదిశ్వాస విడిచిన బాధితులు
కర్నూలు: పత్తిచేనులో పనికోసం బైకుపై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాచెల్లెళ్లు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని గూడూరు సమీపంలో చోటు చేసుకుంది. సి.బెళగల్ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే గూడూరు శివార్లలో కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర వీరు వెళ్తున్న బైకును గుర్తు తెలియని వాహనం కొట్టడంతో ఎగిరిపడ్డారు. వీరిని ఢీకొట్టిన వాహనం వేగంగా పరారై వెళ్లడంతో తీవ్ర రక్తగాయాలైన వీరిని ఆస్పత్రికి తరలించే వారెవరూ లేకుండాపోయారు. చాలాసేపు పెనుగులాడిన వీరు తీవ్ర రక్తస్రావంతో కన్నుమూశారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో పత్తి చేనులో కేజీల ప్రకారం పత్తి ఏరే పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం. మృతులు ముగ్గురు బ్రాహ్మణ దొడ్డి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన కృష్ణ, గజ్జలమ్మ, జానకమ్మ గా గుర్తించారు.
ప్రమాద స్థలం వద్ద ఉద్రిక్తత
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ప్రమాద సంఘటన వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులు భారీగా తరలివచ్చి ప్రమాదం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపక్కన పడిన మృతులు చాలాసేపు ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ ఆర్తనాదాలు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ఢీకొట్టిన వాహనదారుడు పట్టించుకోకుండా పరారైపోవడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు వీరు చివరి వరకు పెనుగులాడి తుదిశ్వాస విడిచారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పొరపాటున ఢీకొట్టినా.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించకపోవడం వల్లే చనిపోయారని.. ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవారని కంటతడిపెట్టుకుంటూ చెబుతున్నారు. ఢీకొట్టిన వాహనాన్ని సీసీ కెమెరాల్లో చూసి గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ట్రాక్టరే ఢీకొట్టి ఉంటుందని అనుమానాలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
for more News…