- లేటెస్ట్గా మరొకరితో ఎఫైర్
- ముగ్గురితో వేర్వేరుగా కాపురం
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మూడో భార్య
వరంగల్ సిటీ, వెలుగు: రెండేండ్లలో ముచ్చటగా మూడు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆ ముగ్గురితో వేర్వేరు ప్రాంతాల్లో కాపురాలు చేస్తున్నాడు. తాజాగా మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడు. విషయం ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న మూడో భార్యకు తెలవడంతో కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ ఏనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్యనగర్‍కు చెందిన మద్ది రాజేశ్ హైదరాబాద్‍లో కారు డ్రైవర్‍గా పని చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరిలో వరంగల్ చార్‍బౌలికి చెందిన సుమనప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత మూడు నెలలకే ఏపీకి చెందిన శ్రావణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు నెలలకు సొంత ఊరు వరంగల్ వచ్చి తానుండే సుందరయ్యనగర్‍కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించాడు. 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ ఆర్య సమాజ్‍లో మూడో పెళ్లిచేసుకున్నాడు. ఎవ్వరికీ డౌట్ రాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఇండ్లు అద్దెకు తీసుకొని కాపురాలు చేస్తున్నాడు.
లేటెస్ట్గా కరుణ అనే మరో యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం మూడో భార్య సారికకు తెలిసింది. సోమవారం వరంగల్ వచ్చిన రాజేశ్‌ను అత్తింటివారు నిలదీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు డయల్ 100 ర్‍కు ఫోన్ చేశారు. రాజేశ్ వారి కళ్లుగప్పి పారిపోయాడు. దీంతో బాధిత కుటుంబం ఏనుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.