- మాట ప్రకారం ఫ్యాక్టరీ ఇచ్చామంటున్న బీజేపీ
- విభజన హామీల్లో చేర్చిందే తామంటున్న కాంగ్రెస్
- తమ పోరాటమే కారణమంటున్న బీఆర్‍ఎస్
వరంగల్, వెలుగు : కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం మీరంటే మీరేనని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్లు ఇన్నాళ్లూ కొట్టుకున్నారు. తీరా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇటీవల కేంద్రం ఓకే చెప్పడంతో క్రెడిట్ దక్కించుకునేందుకు మూడు పార్టీలు పాకులాడుతున్నాయి. తమ వల్లే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందంటూ ప్రకటనలు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
తమ ప్రభుత్వమే ఫ్యాక్టరీ ఇచ్చిందని ఒకరంటే.. అదేమీ కాదు తాము చట్టం చేశాం కాబట్టే ఫ్యాక్టరీ వచ్చిందంటూ మరో పార్టీ ప్రకటన చేస్తోంది. ఇవేవీ కావు.. తమ పోరాటం వల్లే కేంద్రం దిగొచ్చి ఫ్యాక్టరీ ఇచ్చారని మరో పార్టీ నేతలు చెబుతున్నారు.
కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ కోసం పోటాపోటీ
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్‍ను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. 1982లో మొదటిసారి కోచ్ ఫ్యాక్టరీ తరలివెళ్లాక 40 ఏండ్లకు పైగా కాజీపేట రైల్వే స్టేషన్ కేంద్రంగా నిరసనలు, ధర్నాలు కొనసాయి. ఈ క్రమంలో 2015లో పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) మంజూరైంది. దీనిపై కూడా రాజకీయం నడిచింది.
పీవోహెచ్, వ్యాగన్ల తయారీ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ విభజన చట్టంలోని హామీ ప్రకారం గతంలో ఇచ్చిన ప్రాజెక్ట్‌లకు అనుబంధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీగా అప్‍గ్రేడ్ చేస్తూ సెప్టెంబర్ 9న కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంపై నవంబర్ 28న అధికారిక ప్రకటన వెలువడింది.
తమ వల్లే అంటూ బీజేపీ సంబురాలు
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే కాజీపేటకకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని కమలం పార్టీ లీడర్లు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఫ్లెక్సీలకు క్షీరాభిషేకంచేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు సార్లు ఫ్యాక్టరీ ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీనే కాజీపేట రైల్వే అభివృద్ధికి చర్యలు తీసుకుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.
2014లో తాము అధికారంలోకి వచ్చాక 2015లో పీవోహెచ్ మంజూరు చేసి రూ.188 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. 160 ఎకరాల భూములు అడిగితే అప్పటికే బీఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. మోదీ వరంగల్ పర్యటన టైంలో వ్యాగన్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసిన కేంద్రం ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసిందని, ఈ క్రెడిట్ తమదేనని బీజేపీ లీడర్లు అంటున్నారు.
160 ఎకరాలు ఇచ్చామంటున్న బీఆర్‍ఎస్
తమ ఉద్యమాలతోనే కోచ్ ఫ్యాక్టరీ కల సాకారమైందని బీఆర్‍ఎస్ నేతలు ప్రెస్‍మీట్లు పెడుతున్నారు. తాము ఓ వైపు ఉద్యమాలు చేస్తూనే.. మరోవైపు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన 160 ఎకరాలను సేకరించి ఇచ్చామని చెబుతున్నారు. కాంగ్రెస్ హయంలోనే కోచ్ ఫ్యాక్టరీలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని, ఫ్యాక్టరీ ఇవ్వలేమని బీజేపీ నేతలు గతంలోనే బహిరంగంగానే చెప్పారని గుర్తు చేస్తున్నారు. గత సీఎం కేసీఆర్ కృషి వల్లే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందని చెబుతున్నారు.
విభజన చట్టం, సీఎం కృషి అంటున్న కాంగ్రెస్
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరుకు కాంగ్రెస్ నిర్ణయాలు, లీడర్లే కృషే కారణమని హస్తం పార్టీ ఎంపీలు, మంత్రులు చెబుతున్నారు. కాజీపేటపై తమకు గౌరవం ఉంది కాబట్టే గతంలోనూ మూడు సార్లు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అడుగులు వేశామన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటు టైంలో విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీని పొందుపరిచామన్నారు. ఆపై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, బీఆర్‍ఎస్ పట్టించుకోకపోవడంతో తామే పోరాటానికి దిగామంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలుగా కేంద్రంపై ఒత్తిడి తేవడం వల్లే ఫ్యాక్టరీ మంజూరైందని చెబుతున్నారు.