
- మృతుల్లో అంబేలీ పేలుడు సూత్రధారి అనిల్
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఇంద్రావతి నది సమీపంలోని అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. బైరంగఢ్లో ఇంద్రావతి నది సమీప అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో దంతెవాడ, బీజాపూర్ ఎస్పీలు గౌరవ్ రాయ్, జితేంద్ర కుమార్ యాదవ్ పర్యవేక్షణలో 400 మందితో కూడిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఉదయం 9 గంటలకు బలగాలకు మావోయిస్టులు ఎదురపడడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు.
కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించగా మట్వాడా ఎల్‌ఓఎస్ కమాండర్ అనిల్ పూనెంతో మరో ఇద్దరు మావోయిస్టుల డెడ్‌బాడీలు కనిపించాయి. అనిల్ పూనెం అంబేలి ప్రాంతంలో డీఆర్‌జీ జవాన్ల వాహనాన్ని పేల్చి 9 మంది జవాన్లను చంపిన కేసులో కీలక సూత్రధారి అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉందని, మిగిలిన ఇద్దరిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలం నుంచి 12 బోర్ తుపాకులు, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన ఎన్‌కౌంటర్లలో 146 మంది చనిపోయారని వెల్లడించారు.