భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఎస్పీ నిఖిల్ రాఖేచా తెలిపిన వివరాల ప్రకారం... చత్తీస్‌గఢ్, ఒడిశా బార్డర్‌లోని గరియాబంద్ జిల్లా సోడ్నేమాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మకాం వేసినట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన సీఆర్‌పీఎఫ్, చత్తీస్‌గఢ్ డీఆర్‌జీ బలగాలను రంగంలోకి దించారు.
అడవిలో కూంబింగ్ చేస్తున్న బలగాలకు సోడ్నేమాల్ ప్రాంతంలో మావోయిస్టులు కనిపించారు. బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవిలోకి పారిపోయారు. తర్వాత ఘటనాస్థలాన్ని భద్రతాబలగాలు పరిశీలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ గన్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకుని గరియాబంద్‌కు తరలించారు. మరణించిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.
మందుపాతర పేలి ముగ్గురు జవాన్లకు గాయాలు
మందుపాతర పేలి ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గంగులూరు పీఎస్ పరిధిలోని తోక్డా గ్రామ సమీపంలోని అడవుల్లో శుక్రవారం డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ చేపట్టారు. ఈ టైంలో ముగ్గురు జవాన్లు ఐఈడీపై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దీంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.