ఇంటర్ బోర్డును తప్పుబట్టిన త్రిసభ్య కమిటీ

ఇంటర్ బోర్డును తప్పుబట్టిన త్రిసభ్య కమిటీ
  • టెండర్ దశ నుంచి గ్లోబరీనా చేసిన పనుల పరిశీలన
  • అగ్రిమెంట్‌ లేకుండానే వర్క్‌ ఇవ్వడంపై విస్మయం
  • 12 పేజీలతో రిపోర్టు.. వంద పేజీలతో అనుబంధ నివేదిక

ఇంటర్ ఫలితాలను కనీసం క్రాస్‌ చెక్ చేసుకోకపోవడమే ఇంటర్మీడియెట్ బోర్డు ప్రధాన తప్పిదమని త్రిసభ్యకమిటీ గుర్తించింది. దీంతోనే రిజల్ట్స్ లో గందరగోళం నెలకొందని తేల్చినట్లు తెలిసింది. ఇంటర్‌ ఫలితాల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. టెండర్ దశ నుంచి ఇప్పటి వరకూ గ్లోబరీనా చేసిన పనులను పరిశీలించి, మెరిట్స్‌, డీమెరిట్స్ ను తెలుసుకుని, నివేదికలో వివరించింది. గ్లో బరీనా,బోర్డు మధ్య అధికారికంగా ఎలాంటి అగ్రిమెంట్‌  లేకుండానే, ఇంత పెద్ద వర్క్‌ జరుగుతుండటంపై కమిటీ విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. భవిష్యత్‌ పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలనే దానిపైనా నివేదికలో సూచనలు చేసినట్టు సమాచారం. రిపోర్టు ఆధారంగానే బోర్డు అధికారులతో పాటు గ్లో బరీనా సంస్థపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.

రెండు రిపోర్టులు

కమిటీ తమ రిపోర్టును రెండు రూపాల్లో ఇవ్వనుంది.మెయిన్‌ రిపోర్ట్‌ 12 పేజీలతో, దానికి అనుబంధంగా సుమారు వంద పేజీలతో మరో నివేదిక ఉన్నట్టు తెలిసింది. ప్రధాన నివేదికలో గ్లోబరీనా, ఇంటర్ బోర్డు తప్పిదాలను బ్రీఫ్ గా ఇవ్వగా, 15 అంశాలతో అనుబంధ నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.మూడు రోజులపాటు ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థ ప్రతినిధులను విచారించారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేయకుండా సంస్థ, బోర్డు లోపాలను ఎత్తిచూపినట్టు సమాచారం.

రెండు రోజులుగా వాయిదాలు

సర్కారుకు రిపోర్ట్‌ అందించడంలో రెండు రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం రాత్రే నివేదిక రెడీ అయినా, శుక్రవారం ప్రభుత్వ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో ఇవ్వలేదు. మధ్యాహ్నం  అందించాలనుకున్నా , కమిటీలోని  ఓ సభ్యుడు అందుబాటులో లేక సాయంత్రానికి వాయిదా వేశారు. సాయంత్రం ప్రభుత్వ పెద్దలు లేకపోవడంతో, శనివారం విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు.