వైఎస్  వివేకానంద రెడ్డి హత్య కేసు అఫ్డేట్స్

వైఎస్  వివేకానంద రెడ్డి హత్య కేసు అఫ్డేట్స్

మాజీ మంత్రి  వైఎస్  వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు పోలీసులు. వివేక ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్ ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సిట్ అధికారులు. సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యవహారంలో వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్ లను అరెస్టు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

ఈనెల 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది.. అదే రోజు ఉదయం ఐదున్నర గంటలకు మొదటిసారి తానే ఇంట్లోకి  వెళ్లినట్లు వివేక పీఏ కృష్ణారెడ్డి చెప్పడంతో… అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో విచారిస్తున్నారు సిట్ అధికారులు. వివేకనందరెడ్డి రాసిన లేఖ దొరికినా.. సాయంత్రం వరకు ఎందుకు ఇవ్వలేదని పీఏను ప్రశ్నిస్తున్నారు.

వివేక హత్య జరిగిన తర్వాత బాత్రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బెడ్రూమ్ కి తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శవాన్ని బెడ్ రూంలోకి తీసుకురావడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ … రక్తపు మరకలు కడిగాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగినప్పటి నుంచి 50మందికి పైగా సాక్షులను విచారించిన పోలీసులు… కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హత్య ఎవరు చేశారనే దానిపై సిట్  దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పరమేశ్వర్  రెడ్డి, శేఖర్  రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.