హూస్టన్: అమెరికాలో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భారత సంతతి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కారులోనే సజీవదహనం అయ్యారు. భార్య, భర్త, కూతురు దుర్మరణం చెందగా పద్నాలుగేండ్ల కొడుకు అనాథగా మారాడు. టెక్సాస్ స్టేట్ లోని లంపాసస్ కౌంటీలో బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లియాండర్ సిటీకి చెందిన అర్వింద్ మణి(45), ప్రదీపా అర్వింద్(40) భార్యాభర్తలు. వారికి కూతురు ఆండ్రిల్ అర్వింద్ (17), కొడుకు ఆదిర్యన్ (14) ఉన్నారు. ఆదిర్యన్ నైన్త్ గ్రేడ్ చదువుతుండగా, ఆండ్రిల్ హైస్కూల్ విద్యను పూర్తి చేసుకుని కాలేజీలో చేరింది.
బుధవారం ఆండ్రిల్ను తీసుకుని అర్వింద్ దంపతులు కారులో యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్ కాలేజీలో దింపేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని బలి తీసుకుంది. లంపాసస్ కౌంటీ వద్ద వారికి ఎదురుగా అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే మంటలు అంటుకోవడంతో ఎవరూ బయటపడే అవకాశం లేక సజీవ దహనం అయ్యారు. అర్వింద్ కారును ఢీకొట్టిన కారును 31 ఏండ్ల వ్యక్తి నడిపాడని, ఆ సమయంలో కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడనీ పోలీసులు తెలిపారు. ప్రమాదంలో వారిద్దరు కూడా చనిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో అర్వింద్ కారు గంటకు 112 కి.మీ. స్పీడ్ తో వెళ్తుండగా.. ఎదురుగా 160 కి.మీ. స్పీడ్ తో వచ్చిన కారు ఢీకొట్టిందన్నారు.
ఫండ్ రైజింగ్ లో రూ. 6 కోట్ల విరాళాలు
అనాథగా మారిన ఆదిర్యన్ను ఆదుకునేందుకు గో ఫండ్ మీ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టగా శనివారం నాటికల్లా 7.58 లక్షల డాలర్లు (రూ. 6.35 కోట్లు) సమకూరాయి.