ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు మృతి

  • భారీగా ఆయుధాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్ గడ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా పామేడు పోలీస్​స్టేషన్​ పరిధిలోని రేఖాపల్లి అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ పి కథనం ప్రకారం.. ఊసూరు, బాసగూడ, పామేడు పోలీస్​స్టేషన్ల పరిధిలోని అడవుల్లో పీఎల్జీఏ బెటాలియన్​ మావోయిస్టులు భారీ సంఖ్యలో సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్​ కోబ్రా 210 బెటాలియన్, డీఆర్జీ బలగాలను రంగంలోకి దించారు.

గురువారం నుంచే బలగాలు కూంబింగ్​ ఆపరేషన్​ చేపట్టి ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. పారిపోతూ మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో రేఖాపల్లి అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పలు జరగగా, ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఒక ఎస్ఎల్ఆర్, 303, ఇన్సాస్​ తుపాకీ, రెండు దేశీ నాటు తుపాకులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు గాయపడ్డారని వారి కోసం గాలిస్తున్నట్లు ఐజీ తెలిపారు. భద్రతాబలగాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.