
షాద్ నగర్, వెలుగు: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. ఇండియా టైమ్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున షాపింగ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్పవిత్రాదేవి భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు ప్రగతిరెడ్డి(35)ని సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాలకు చెందిన రోహిత్ రెడ్డికి ఇచ్చి పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
వీరు అమెరికాలోని ఫ్లోరిడాలో సెటిల్ అయ్యారు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత కూడా వీరితో పాటే ఉంటున్నది. కాగా ప్రగతిరెడ్డి, రోహిత్ రెడ్డి, ఇద్దరు పిల్లలు, సునీత కలిసి సోమవారం తెల్లవారుజామున కారులో షాపింగ్‌కు బయలుదేరారు. వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో కారులోని ప్రగతిరెడ్డి, ఆమె పెద్ద కొడుకు అర్విన్, అత్త సునీత అక్కడికక్కడే చనిపోయారు. రోహిత్ రెడ్డి, అతని చిన్న కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో రోహిత్ డ్రైవ్ చేస్తున్నాడు. పోలీసులు గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో టేకులపల్లిలో విషాదం అలముకుంది. మృతులకు ఫ్లోరిడాలోనే అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు అమెరికా బయలుదేరారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.