తెలంగాణకు కేంద్ర మంత్రి పదవులు .. రేసులో కిషన్ రెడ్డి , డీకే అరుణ, ఈటల

తెలంగాణకు కేంద్ర మంత్రి పదవులు ..  రేసులో కిషన్ రెడ్డి , డీకే అరుణ, ఈటల

హైదరాబాద్ , వెలుగు:  కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి ఒకటి లేదా రెండు పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే, అవి ఎవరికి దక్కుతాయన్న చర్చ మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. వీరిలో దాదాపు అందరూ సీనియర్ నేతలు కావడంతో ప్రతి ఒక్కరూ తాము మంత్రి పదవి రేస్​లో ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్  ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రానికి ఒక కేబినెట్ లేదా ఇండిపెండెంట్ మంత్రి పదవితో పాటు మరో సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కొత్త సర్కార్​లో ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారడంతో మిత్రపక్షాలకు కూడా ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఎక్కువగా సొంత పార్టీ నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే వచ్చే చాన్స్​ ఉన్నట్టు తెలిసింది. 

ఎనిమిది మందిలో ఎవరికో?

నిన్నమొన్నటి వరకు కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కగా ఈ సారి ఈటల రాజేందర్​కు బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కిషన్​రెడ్డికి మళ్లీ చాన్స్​ ఇవ్వొచ్చన్న వార్తలూ వస్తున్నాయి. బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్​ డీకే అరుణ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజా మాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ కూడా రేస్​లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆదిలాబాద్ నుంచి గెలిచిన గోడెం నగేష్, చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్​ నుంచి గెలిచిన రఘనందన్ రావు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. 

బీజేపీకి తగ్గనున్న మంత్రి పదవులు

2014, 2019లో కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడంతో అన్ని రాష్ట్రాల్లో ఎన్డీయేలో ఉన్న ఇతర పార్టీల కంటే బీజేపీ ఎంపీలకే ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అయితే, ఈసారి బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడంతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలకు మంత్రి పదవుల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.