- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ సమస్యలపై ముగ్గురు మంత్రుల నజర్
- ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై ఫోకస్
- ఇవాళ కలెక్టరేట్ లో ప్రాజెక్టులు, పథకాలపై సమీక్ష
- రేపు సీతారామ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన
ఖమ్మం, వెలుగు : ఏన్కూరు కాల్వ ద్వారా వైరా రిజర్వాయర్ కు సీతారామ ప్రాజెక్టుకు నీళ్లను తరలించి ఆగస్టు 15 నాటికి జిల్లాకు నీటిని విడుదల చేయాలని ముగ్గురు మంత్రులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టుకు రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు మంత్రులు రూ.100 కోట్లతో లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే ప్లాన్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఫోకస్
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పెషల్ఫోకస్పెట్టారు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో పాలనపై దృష్టిసారించారు. ముగ్గురు కలిసి తొలిసారి జిల్లాకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఆర్నెళ్ల కింద మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ నుంచి ముగ్గురు కలిసి ఉమ్మడి జిల్లాలో పర్యటించారు.
ఆ తర్వాత వేర్వేరుగా పలు అంశాలపై మంత్రులు సమీక్షలు చేసినా.. ముగ్గురూ కలిసి జిల్లాపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించడం ఇదే తొలిసారి. ఖమ్మం కలెక్టరేట్(ఐడీఓసీ)లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, ఇతర సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా మంత్రులు సమీక్షించనున్నారు. జిల్లాలో గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో మీటింగ్ కు అటెండ్ కావాలని ఆఫీసర్లను ఆదేశించారు. అంతకు ముందు ఎన్ఎస్పీ క్యాంప్ లో స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయనున్నారు.
చకచకా ‘సీతారామ’ పనులు
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సీతారామ ప్రాజెక్టును ఇప్పుడు త్వరగా పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పలు మార్లు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల సమీక్షలు నిర్వహించారు. కాగా, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రాజెక్టును గురువారం ముగ్గురు కలిసి సందర్శిస్తారు.
అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఉదయం 10గంటలకు మంత్రులు దుమ్ముగూడెంకు చేరుకొని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అశ్వారావుపేట మండలం బిజి కొత్తూర్‌లోని పంప్ హౌజ్, కెనాల్, ముల్కలపల్లి మండలం పంప్ హౌజ్ -2, కమలాపురం మండలం పూసుగూడెంలోని పంప్ హౌజ్ -3, కెనాల్స్ పనులను పరిశీలిస్తారు. కమలాపురం వయా పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు మీదుగా ఏన్కూర్ లింక్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు.
‘ధరణి’ పెండింగ్ దరఖాస్తుల క్లియర్‌కు చర్యలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 2.55లక్షల ధరణి దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడారు. ధరణి పెండింగ్ దరఖాస్తులలో ఎన్నికల ముందు లక్ష వరకు క్లియర్ చేశామన్నారు.
ఎన్నికల కోడ్‌తో కొంత ఆగిందని, పెండింగ్ దరఖాస్తులతో పాటు అన్ని ఫిర్యాదులను త్వరగా క్లియర్ చేసేందుకు ఆఫీసర్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని చెప్పారు. రైతుల సమస్యలు, విత్తనాల కొరతంటూ బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే కంపెనీకి సంబంధించి సీడ్స్ అడుగుతుండడంతో కొంత ఇబ్బంది కలుగుతుందే తప్ప ఎక్కడా సమస్యలు లేవన్నారు. మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లతో రివ్యూలు చేస్తూ విత్తనాల కొరత లేకుండా చూస్తున్నారని చెప్పారు.
ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు..
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌ను పెద్ద సంఖ్యలో ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. రూ. 650కోట్లతో రాష్ట్రంలో అమ్మ ఆదర్శ బడులను అభివృద్ధి చేశామన్నారు. మిషన్ భగీరథ పేర గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ. 39వేల కోట్లను ఖర్చు పెట్టింది.. కానీ ఏజెన్సీ గ్రామాల్లో స్వచ్ఛమైన తాగు నీరు అందని ద్రాక్షగానే మారిందని చెప్పారు. తాగు నీటి సప్లైకి చర్యలు చేపడుతున్నామన్నారు.
సాకులు చెప్పొద్దు...
కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. పూర్తి స్థాయి వివరాలు లేకుండా మీటింగ్ ఎట్లా వస్తారంటూ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పడం ఆపి పూర్తి వివరాలతో మీటింగ్‌లకు అటెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని రేగళ్ల, పాల్వంచ, చాతకొండ, మామిడిగుండాలతో పాటు పలు చోట్ల పెద్ద సర్వే నంబర్లలో భూ సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి స్పెషల్ మీటింగ్ పెట్టనున్నట్టు తెలిపారు.
స్టూడెంట్స్‌కు రెండు జతల యూనిఫామ్ తప్పకుండా ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. త్రీ ఫేస్కరెంట్ లేక పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడతున్నారని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల పట్టాలున్న వారి పొలాల్లో రైతులు బోర్లు వేసుకునేందుకు అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.
కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్‌తో పాటు మాతా శిశు సంరక్షణ హాస్పిటల్స్‌లో నాణ్య మైన వైద్య సేవలందండం లేదని, దీనిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, మాలోత్ రాందాస్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్
వేణుగోపాల్ పాల్గొన్నారు.