3 నెలలు.. 35 వేల కోట్లు...రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు

3 నెలలు.. 35 వేల కోట్లు...రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సర్దుబాటు

 

  • స్కీమ్​లు, కీలక ప్రాజెక్టులకు సర్కార్​ నిధుల వేట
  • రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకూ కొంత..!  
  • ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు
  • ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి

హైదరాబాద్, వెలుగు: కీలక ప్రాజెక్టులకు, పథకాల అమలుకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న మూడు నెలల్లో కనీసం రూ.35 వేల కోట్ల మేర ఫండ్స్​ను మొబిలైజ్​ చేసే పనిలో పడింది. పెండింగ్​లో ఉన్న యాసంగి రైతుభరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్​ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా అందింది. 

మిగిలిన మొత్తానికి మే రెండో వారంలోపు పంపిణీ పూర్తి చేయాలని అధికారులు ప్లాన్  చేస్తున్నారు. ఇక, త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్​కు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసమూ ఇప్పటి నుంచే నిధులను సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.  ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్​ యువ వికాసానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ యాక్షన్​ ప్లాన్​ రెడీ చేస్తున్నది.  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్​ రింగ్​ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్  రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చేందుకూ నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర సర్కార్​ సంప్రదింపులు జరుపుతున్నది. ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి పెట్టింది.  

 రాష్ట్ర ప్రభుత్వం రీజినల్​ రింగ్​ రోడ్డు, మెట్రో ఫేజ్​ 2, రేడియల్​ రోడ్ల నిర్మాణం కోసం రానున్న మూడు నాలుగు నెలల్లో కనీసం రూ.3 వేల కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉన్నది. కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని అడిగినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జైకా వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో పాటు దేశంలోనూ వివిధ సంస్థలతో రుణాల కోసం సంప్రదింపులు చేస్తున్నది. మరికొంత ఖజానా నుంచే చెల్లించాల్సి ఉంటుంది. 

 340 కిలో మీటర్ల మేర ఉన్న ట్రిపుల్​ ఆర్​ ఉత్తర, దక్షిణ భాగాలకు మొత్తం రూ.34,367.62 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నార్త్​ఫేజ్​ డీపీఆర్​ తుది దశకు చేరుకున్నది. ఇక సౌత్​ ఫేజ్ డీపీఆర్​ కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్లను నిర్మించనున్నప్పటికీ భూసేకరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మేర భరించాల్సి ఉంటుంది. 

ఇందుకు మూడునెలల్లో  దాదాపు రూ.1,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఇక,  మెట్రో ఫేజ్-2 కు రూ.24,269 కోట్లు అంచనా వేశారు. త్వరలోనే డీపీఆర్​లు ఖరారు అయితే.. దీనికి కూడా ప్రభుత్వం కొంత నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.  రేడియల్ రోడ్లకు దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా.. జైకా నుంచి రూ.380 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రుణ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయి. రేడియల్​ రోడ్లకు సంబంధించి జులై నాటికి తక్షణ అవసరాల కోసం కనీసం రూ.1,000 కోట్ల మేర అయినా ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 

ఆదాయ మార్గాలపై ఫోకస్​ 

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ.. ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీలు, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, రెగ్యులర్​గా నెలా నెలా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్​లకే పోతున్నది. దీంతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఆదాయ మార్గాల్లో భాగంగా ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లను క్లియర్​ చేస్తున్నది. రిజిస్ట్రేషన్లు, లిక్కర్​ ఆదాయంపైనా ఫోకస్​ పెట్టింది. ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

 ప్రభుత్వానికి ప్రతినెలా యావరేజ్ గా ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.18 వేల కోట్ల దాకా వస్తున్నది. అయితే ఖర్చులు మాత్రం రూ.23 వేల కోట్లు చేయాల్సి ఉన్నది. చేయూత పెన్షన్లు, ప్రతినెలా ఇతర గ్రీన్​ ఛానెల్​ పథకాలకు దాదాపు రూ.2 వేల కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.5 వేల కోట్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు రూ.6,500 కోట్లు  చెల్లిస్తున్నది. పెండింగ్​ బిల్లులకు, ఇతర అత్యవసరాలకు రూ.4 వేల కోట్లు ఇస్తున్నారు. దీంతో మిగిలిన పథకాలకు, ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడుతున్నది. 

మూడు స్కీములకు ఇట్ల..!

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు రూ.5 లక్షల సహాయం అందించేందుకు రూ. 12,571 కోట్లు కేటాయించారు. ఇందులో కొంత కేంద్రం నుంచి పీఎంఏవై పథకం కింద రూ.4,600 కోట్లు రానున్నాయి. ఇక కొంత రుణాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నది. మిగిలిన మొత్తం ఖజానా నుంచే ఇవ్వనుంది.

 ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున  70,122 మంది లబ్ధిదారులను తొలివిడతలో గుర్తించారు. ఈ పథకంలో దాదాపు 14 వేల ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులు ప్రారంభం కాగా..  1,800 ఇండ్ల బేస్మెంట్ నిర్మాణం పూర్తయింది. వీరికి చెల్లింపులు మొదలుపెట్టారు. పైగా ఇవన్నీ గత ఆర్థిక సంవత్సరం కింద మంజూరైనవే కావడం.. ఈసారి మరిన్ని ఇండ్లు మంజూరు చేయాల్సి ఉండటంతో కనీసం రూ.5 వేల కోట్లు మూడు నెలల కోసం ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నది. 


రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్  వర్గాల నిరుద్యోగ యువతకు రూ.2.40 లక్షల వరకు సబ్సిడీ రుణాల కింద రూ. 6 వేల కోట్ల ఇవ్వాల్సి ఉన్నది. జూన్​ 2 తర్వాత నుంచి  ఈ మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు. 

యాసంగి పెట్టుబడి సాయం నిధుల జమ గత రెండు నెలల కిందటి నుంచే జరుగుతున్నది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా  అందింది. త్వరలోనే  4 ఎకరాలు, ఆ పైన ఉన్న రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో నిధులు రిలీజ్​ చేయనున్నారు. ఇందుకోసం రూ. 4 వేల కోట్ల మేర అవసరమని అధికారులు చెప్తున్నారు. వీటిని పంపిణీ చేస్తే  యాసంగి రైతు భరోసా కంప్లీట్​ అవుతుంది. ఇక, రానున్న జూన్ లేదా జులై నెలలోనే మళ్లీ వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కొంత కసరత్తు చేసి అందించనుంది. ఇందుకు దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయి.