విద్యుత్ శాఖ ఉద్యోగుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు నెలల జీతం

విద్యుత్  శాఖ ఉద్యోగుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు నెలల జీతం
  • రూ.4.85 కోట్లకు బదులుగా రూ.14.55 కోట్లు జమ
  • నాగర్  కర్నూల్ ఎస్బీఐ అధికారుల నిర్వాకం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ ‌‌కర్నూల్  ఎస్బీఐ అధికారుల నిర్వాకంతో విద్యుత్  శాఖ ఉద్యోగుల ఖాతాల్లో రూ.4.85 కోట్లకు బదులుగా రూ.14.55 కోట్లు జమ అయ్యాయి. ఆలస్యంగా తేరుకున్న బ్యాంక్  అధికారులు ఆ డబ్బును రికవరీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటన ఈ నెల 3న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ ‌‌కర్నూల్  జిల్లాలోని విద్యుత్  శాఖలో పని చేస్తున్న 506 మంది ఉద్యోగుల నెలసరి వేతనాల చెల్లింపుకు ఆ శాఖ ఉన్నతాధికారులు రూ.1.85 కోట్లు, రూ.3 కోట్ల రెండు చెక్కులతో పాటు ఉద్యోగుల జాబితా, బ్యాంక్  ఖాతా నంబర్లతో సహా నాగర్ ‌‌కర్నూల్  మెయిన్  రోడ్​ ఎస్బీఐ బ్రాంచ్​కు పంపించారు.

అక్కడి క్యాషియర్, ఆయన పై అధికారి నిర్లక్ష్యం కారణంగా ఒక్కో ఉద్యోగికి మూడు నెలల జీతం ఖాతాల్లో జమ అయింది. లావాదేవీల్లో భారీగా తేడా రావడంతో బ్యాంక్  అధికారులు ఖంగు తిన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించి విద్యుత్  శాఖ, ఆర్బీఐకి వేర్వురుగా సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు జీతాలు ఎక్కువగా జమ అయిన ఖాతాల లావాదేవీలు నిలిపేశారు. అయితే అప్పటికే100 మందికి పైగా ఉద్యోగులు డబ్బులు డ్రా చేసుకున్నారు.

దీంతో రికవరీ చేసేందుకు బ్యాంక్  ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. నాలుగు రోజులుగా రికవరీ కోసం కుస్తీ పడుతున్నారు. ఈ తప్పిదానికి కారణమైన ఇద్దరు బ్యాంక్​ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. దీనిపై బ్యాంక్  మేనేజర్  మధుసూదన్ ‌‌రావును వివరణ కోరగా.. సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని, రికవరీ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని 
తెలిపారు.