రామ్​సర్ జాబితాలో మరో 3 చిత్తడి నేలలు

రామ్​సర్ జాబితాలో మరో 3 చిత్తడి నేలలు

భారతదేశంలోని మరో మూడు చిత్తడి నేలలు రామ్​సర్​ సైట్స్​ జాబితాలో చేరాయి.తమిళనాడు రాష్ట్రంలోని నంజరాయన్​, కజువేలి పక్షుల అభయారణ్యాలు, మధ్యప్రదేశ్​లోని తవా రిజర్వాయర్ రామ్​సర్​ సైట్స్​ జాబితాలో చేరాయి. వీటితో కలిపి ఇప్పటివరకు రామ్​సర్​ జాబితాలో చేరిన చిత్తడి నేలలు సంఖ్య 85కు చేరింది. దేశంలో 13,58,068 హెక్టార్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి. 

నంజరాయన్​ పక్షుల అభయారణ్యం: తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్​ జిల్లాలో నంజరాయన్​ పక్షుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో అనేక రకాల సరీసృపాలు, చేపలు, ఉభయచరాలు, వృక్ష జాతులతోపాటు దాదాపు 130 పక్షి జాతులు ఉన్నాయి. 

కజువేలి పక్షుల అభయారణ్యం: తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలో కజువేలి పక్షుల అభయారణ్యం ఉంది. పులికాట్​ సరస్సు తర్వాత దక్షిణ భారతదేశంలోని రెండో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. కజువేలి సరస్సులో 226 జీవజాతులు ఉన్నాయి. మధ్య ఆసియా, సైబీరియా నుంచి అనేక సుదూర వలస పక్షులు ఇక్కడి వస్తుంటాయి. 

తవా రిజర్వాయర్​: ఇది తవా నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా ఏర్పడిన మానవ నిర్మిత సరస్సు. మధ్యప్రదేశ్​ రాష్ట్రం నర్మదాపురం జిల్లాలో ఉంది. ఈ రిజర్వాయర్​ సాత్పుర నేషనల్​ పార్క్​, బోరి వన్యప్రాణుల అభయారణ్యంతో పశ్చిమ సరిహద్దును ఏర్పరుస్తుంది. 

రామ్​సర్​ చిత్తడి నేలలు

అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ తొలి సదస్సు జరిగిన 1997, ఫిబ్రవరి 2ను ప్రతి ఏటా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా  జరుపుకుంటారు. రామ్​సర్​ ఒప్పందంలో 1982, ఫిబ్రవరి 1న భారత్​ చేరింది. 1982లో జరిగిన కన్వెన్షన్​లో  భాగస్వామైంది.