హైదరాబాద్ లో మరో మూడు స్కిల్ సెంటర్లు

హైదరాబాద్ లో మరో మూడు  స్కిల్ సెంటర్లు
  • మల్లెపల్లి, బోరబండ, ఎల్బీనగర్​లో  ఏర్పాటు చేయనున్న బల్దియా 
  • ప్రస్తుతం చందానగర్ లో   కొనసాగుతున్న సెంటర్ 
  •  డ్రైవింగ్ నుంచి ఐటీ ఉద్యోగాల వరకు ఉచిత కోచింగ్
  • 950 మందిలో ఇప్పటికేజాబ్స్​ కొట్టిన 442 మంది 

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో మరో మూడు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే చందానగర్ లో సీఎస్ఆర్ కింద లైట్‌‌‌‌‌‌‌‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సహకారంతో సెంటర్ రన్​అవుతోంది. యువత నుంచి స్పందన రావడంతో బోరబండ, మల్లెపల్లి, ఎల్బీనగర్​లోనూ ఏర్పాటు చేసేందుకు బల్దియా అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్(యూసీడీ) కసరత్తు చేస్తోంది. డ్రైవింగ్, వెహికిల్ మెకానిక్ నుంచి మొదలు పెడితే ఐటీ జాబ్ ల వరకు మొత్తంగా వంద రకాల కోర్సులపై ఈ సెంటర్లలో కోచింగ్ ఇస్తారు.

అసలు చదువుకోని వారి నుంచి డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులకు కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత ఉద్యోగావశాలను కల్పించి, ఏడాదిపాటు వారి పనితీరు పరిశీలిస్తారు. చందానగర్ లో 2023 ఏప్రిల్​లో ఒక సెంటర్​ను ప్రారంభించగా, ఇప్పటివరకు 950 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చామని, 442 మందికి ఉద్యోగాలు దొరకాయని అధికారులు చెబుతున్నారు.  

ఐటీ ఉద్యోగులతో క్లాసులు..

బీటెక్, ఎంటెక్ చదివినా కొంతమంది యువతలో స్కిల్స్ ఉండటం లేదు. దీంతో అందరూ ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వీరికి బల్దియా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. నగరంతో పాటు జిల్లాల నుంచి కూడా ఆసక్తి ఉన్నవారు ఈ సెంటర్లలో జాయిన్ కావొచ్చు.

మూడు నెలలపాటు ట్రైనింగ్​ఇస్తారు. ఇప్పటికే చందానగర్​లోని సెంటర్​లో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు జావా డాట్ నెట్, డెవాప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైతాన్, స్యాప్ లకు సంబంధించి వాటితో పాటు ఇతర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే డెలాయిట్, టీసీఎస్ తదితర ఐటీ సంస్థల ఉద్యోగులతో కూడా క్లాసులు చెప్పిస్తున్నారు.  

మహిళలకు స్పెషల్ ​కోర్సులు

మహిళలకు టైలరింగ్ తో పాటు బ్యూటీషియన్, రిసెప్షనిస్టుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, ఆఫీస్​ఎగ్జిక్యూటివ్, ట్యాలీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. టైలరింగ్, బ్యుటీషియన్​కోర్సులు నేర్చుకున్న వారు సొంతంగా బిజినెస్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించేందుకు సహకరిస్తున్నారు.  

గ్రాఫిక్ డిజైనింగ్​ నేర్చుకుంటున్నా

నేను గ్రాఫిక్ డిజైన్​కోర్సులో జాయిన్ అయ్యా. మరో రెండు నెలల్లో కోర్సు పూర్తి కాబోతోంది. ఇప్పటివరకు బేసిక్స్ పూర్తయ్యింది. మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. ఈ సెంటర్ వల్ల చాలా మందికి ఉపయోగం. థాంక్యూ జీహెచ్ఎంసీ.  – సుస్మిత, స్టూడెంట్, చందానగర్ సెంటర్