- టెక్స్ టైల్స్‌లో చామల
- స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు, కావ్యకు అవకాశం
- ఉత్తర్వులు రిలీజ్ చేసిన ఆయా మంత్రిత్వ శాఖలు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఈ మేరకు గురువారం కేంద్ర టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర టైక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. ఈ కమిటీకి కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటూ ఎనిమిది మంది లోక్ సభ, నలుగురు రాజ్యసభ, ఇద్దరు అఫిషియో మెంబర్లతో కలిపి మొత్తంగా14 మంది సభ్యులు ఇందులో ఉండనున్నారు.
అదే విధంగా కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ సంప్రదింపుల కమిటీలో తెలంగాణకు చెందిన ఎంపీలు మల్లు రవి, కడియం కావ్యకు చోటు దక్కింది. ఈ కమిటీకి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇందులో లోక్ సభ నుంచి ఏడుగురు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. అలాగే ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తంగా 16 మంది సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు.