వెలుగు నెట్వర్క్: రాష్ట్రంలో మరో మూడు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చాక బల్దియాల్లో అవిశ్వాసాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా, తాజాగా భువనగిరి, ఖానాపూర్, సుల్తానాబాద్ బల్దియాల్లోనూ కాంగ్రెస్ పాగా వేసింది. జగిత్యాలలో కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
యాదాద్రిలో క్రాస్‌ఓటింగ్
బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్, వైస్ చైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకున్నాయి. జనవరి 23న 31 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతివ్వడంతో బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య పదవులు కోల్పోయారు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో బుధవారం సమావేశం నిర్వహించగా 30 మంది హాజరయ్యారు. కాంగ్రెస్‌కు 11 మంది కౌన్సిలర్లు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 18 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు క్రాస్ ఓటింగ్ చేయగా ఇద్దరు ఇండిపెండెంట్లు ఓటు వేశారు. ఎక్స్అఫిషియో ఓటుతో కలిపి 18 ఓట్లు రాగా వెంకటేశ్వర్లు చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీజేపీకి చెందిన మాయ దశరథ ఏకగ్రీవమయ్యారు.
ఖానాపూర్‌లో రెబల్సాయంతో..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్చైర్పర్సన్పదవిని బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ సాయంతో కాంగ్రెస్దక్కించుకుంది. బుధవారం జరిగిన ఎన్నికలో12మంది కౌన్సిలర్లకు 10 మంది హాజరయ్యారు. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కాగా, నలుగురు బీఆర్ఎస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్. బీఆర్ఎస్అసమ్మతి కౌన్సిలర్ కావలి సంతోష్ మద్దతివ్వడంతో కాంగ్రెస్ కౌన్సిలర్ సత్యం చై ర్మన్‌గా ఎన్నికయ్యారు. సంతోష్ వైస్ చైర్మన్ అయ్యారు.
సుల్తానాబాద్‌లో ఎన్నికయ్యాక కాంగ్రెస్‌లోకి..
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా 2వ వార్డ్ కౌన్సిలర్, బీఆర్ఎస్ అసమ్మతి శిబిరానికి నాయకత్వం వహించిన గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత చైర్ పర్సన్ ముత్యం సునీత ఈ నెల 3న జరిగిన అవిశ్వాసంలో పదవిని కోల్పోయారు. బుధవారం జరిగిన సమావేశంలో 12 మంది కౌన్సిలర్లు హాజరు కాగా, చైర్‌పర్సన్‌గా గాజుల లక్ష్మి ఏకగ్రీవమయ్యారు. ఆ వెంటనే ఆమె పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.