ముగ్గురు మున్నూరు కాపులే.. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘కుల’ సమరం

  • కీలకంగా మారనున్న ముస్లిం, మున్నూరు కాపు ఓట్లు
  • వెలమల ఇలాఖాలో మూడుసార్లు గెలిచి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాట్రిక్
  • ఎమ్మెల్యేగా మూడోసారి బరిలో నిలిచిన ఎంపీ బండి సంజయ్
  • సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ కాంగ్రెస్ టికెట్‌‌‌‌‌‌‌‌పై పురుమళ్ల శ్రీనివాస్ పోటీ

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం ఓటర్లే కీలకం కానున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీలు కూడా వారి ఓట్లపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాయి. ఈ క్రమంలో మున్నూరు కాపు నేతలనే తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఒకప్పుడు వెలమల ఇలాఖాగా పేరొందిన కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మున్నూరు కాపుల రాజకీయ ప్రాబల్యం పెరగడంతో ప్రధాన పార్టీలు కూడా వారికే ప్రాధాన్యమిచ్చాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఇప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నాలుగోసారి పోటీలో ఉండగా, అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గతంలో బీజేపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మున్నూరు కాపు నేత, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ కులం ఓట్లు ఎవరిని ముంచుతాయి.. ఎవరిని తేలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మున్నూరు కాపు, ముస్లింల ఓట్లే కీలకం..

కరీంనగర్ నియోజకవర్గంలో 3.40 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ఇందులో అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో మున్నూరు కాపు, ముస్లిం ఓటర్లు ఉన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాపువాడ పేరుతో ఓ పెద్ద కాలనీనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మున్నూరు కాపుల ప్రాబల్యం చాలా ఎక్కువ. కరీంనగర్ సిటీలోని కార్ఖానాగడ్డ, ఫతేపుర, ముక్రంపుర, కశ్మీర్ గడ్డ, గోదాం గడ్డ, రోజ్ టాకీస్ ఏరియా, రేకుర్తి, కొత్తపల్లి మున్సిపాలిటీలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లే సుమారు లక్షకుపైగా ఉంటాయని అంచనా.

అభివృద్ధి ఎజెండాతో గంగుల ప్రచారం..

2014 తర్వాత కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా వేసిన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌లు, పార్కులు, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఈద్గాకు 8 ఎకరాల స్థలం మంజూరు, త్వరలో నిర్మాణం చేపట్టనున్న టీటీడీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్‌‌‌‌‌‌‌‌ను ప్రచార అస్త్రాలుగా మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడుతున్నారు. అలాగే, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న స్కీమ్‌‌‌‌‌‌‌‌లతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బండి సంజయ్ ఎంపీ అయ్యాక కరీంనగర్ ప్రజలకు కనిపించకుండా పోయారని, ఎంపీ అయ్యాక కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేసింది ఏం లేదని విమర్శిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌పై ఉన్న భూకబ్జా కేసులు, రౌడీ షీట్‌‌‌‌‌‌‌‌ను ప్రచారానికి పెడుతున్నారు.

బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ మాత్రం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చర్చకు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, గ్రూప్ 1 పేపర్ లీకేజీ, ఉద్యోగాల భర్తీలో వైఫల్యం, సివిల్ సప్లై శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే, కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ ఫండ్స్‌‌‌‌‌‌‌‌తోనే కరీంనగర్ డెవలప్ అయిందని, కరీంనగర్ - వరంగల్ ఫోర్ లేన్ హైవేను ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకుపైనే ఆశలు పెట్టుకున్నారు. అలాగే, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులే ఆయనకు మైనస్‌‌‌‌‌‌‌‌గా మారాయి.

ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి ఎనిమిది మందికి చాన్స్..

ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది మున్నూరు కాపులే కావడం విశేషం. మంథని నుంచి పుట్ట మధు, రామగుండం నుంచి కోరుకంటి చందర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఇక, కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ఆది శ్రీనివాస్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పురమల్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు టికెట్లు కేటాయించింది. బీజేపీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌కు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌కు, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో బొమ్మా శ్రీరామ్ చక్రవర్తికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.

వెలమల ఇలాఖాలో మున్నూరు కాపుల హవా..

కరీంనగర్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఎక్కువసార్లు గెలిచింది వెలమ సామాజిక వర్గం నేతలే కావడం గమనార్హం. 1957, 1967, 1972 సాధారణ ఎన్నికల్లో జువ్వాడి చొక్కారావు ఎమ్మెల్యేగా గెలవగా, 1962లో అలిగిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచారు. 1983లో బ్రాహ్మణ(కరణం) సామాజిక వర్గానికి చెందిన కటకం మృత్యుంజయం, ఆ తర్వాత 1985లో వెలమ సామాజిక వర్గానికి చెందిన చల్మెడ ఆనందరావు, 1989లో వెలిచాల జగపతిరావు, 1994లో జువ్వాడి చంద్రశేఖర్ రావు, 1999లో కటారి దేవేందర్ రావు, 2004లో ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) విజయం సాధించారు. 2009లో గంగుల కమలాకర్ గెలిచేంత వరకు ఇక్కడ నుంచి 1978లో ఒక్కసారి మాత్రమే నలమాచు కొండయ్య అనే బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి వరుసగా గంగుల కమలాకర్ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.