
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. కాగా, దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని భద్రతా దళాలకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జవాన్లు వెంటనే నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలో భద్రత దళాలకు తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు కూడా తిరిగి మావోయిస్టులపై ఎదురు కాల్పులు చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన పరస్పర ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను, తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ALSO READ | అవినీతిపై ప్రశ్నించిన యూట్యూబర్.. ఇంటిపై దాడికి దిగిన పారిశుధ్య కార్మికులు..
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 30 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి. ఈ ఎన్ కౌంటర్‌కు ప్రతీకారంగా మార్చి 25న భద్రతా దళాలు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ఐఈడీతో పేల్చారు. దీంతో అప్రతమ్తతమైన జవాన్లు దండకారణ్యాన్ని గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం (మార్చి 25) భద్రతా దళాలు, మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్ కౌంటర్ జరిగింది.