కొత్త క్రిమినల్ చట్టాలు...గొంతెత్తితే నేరమేనా?

కొత్త క్రిమినల్ చట్టాలు...గొంతెత్తితే నేరమేనా?

మూడు కొత్త క్రిమినల్​చట్టాలు 1 జులై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.  క్రిమినల్​ జస్టిస్​సిస్టమ్​​ అనేది ఇప్పుడు రెండు రకాలైన చట్టాలతో నియంత్రించబడతాయి.  జూన్​ 30కి ముందు  నమోదైన కేసులు పాతచట్టాలైన క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ ప్రకారం,  జులై 3 నుంచి నమోదైన కేసులు కొత్త చట్టాలతో  నియంత్రించబడతాయి. ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.  భారత న్యాయశాఖా మంత్రి అర్జున్​రామ్​ మేఘ్ వాల్​ జూన్​ 16న ఓ ప్రకటనని చేశారు. ఆయన ప్రకటన ప్రకారం..పాత చట్టాలైన క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్, భారతీయ పీనల్​ కోడ్,  భారతీయ సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త చట్టాలైన భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత,  భారతీయ సాక్ష్య అధినియంలు 1 జులై 2024 నుంచి అమలవుతాయి. 19వ శతాబ్దం తరువాత సమూల మార్పులు చేయడం ఇద మొదటిసారి.

ఈ ప్రక్షాళన చేయడానికి ప్రధానమైన కారణం హోం మంత్రి అమిత్ షా మాటల్లో చెప్పాలంటే వలస చట్టాల నుంచి ప్రజలకి విముక్తి కలిగించడం.  కాగా, పాత భారతీయ శిక్షాస్మృతిలోని 24సెక్షన్లను తొలగించి, బీఎన్ఎస్ లో 23 కొత్త సెక్షన్లను చేర్చి కొత్త చట్టాన్ని​ రూపొందించారు.  ఇక బీఎన్ఎస్ఎస్​  విషయానికి వస్తే 95శాతం నిబంధనలు క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లో ఉన్నవే.  అంటే మెజార్టీ సెక్షన్లు అన్నీ దాదాపు పాత చట్టాలలో ఉన్నవే. ఈనేపథ్యంలో ఈ పాత చట్టాల ప్రక్షాళన అని అనడం ఎందుకని విజ్ఞుల అభిప్రాయం. చాలా నిబంధనలు పోలీసులకి విశేష అధికారాలు ఇచ్చాయి.

కొన్ని తప్పులు జరిగాయి

ఈ చట్టాలను తీసుకుని రావడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగాయి. కొత్త  క్రిమినల్​ చట్టాలను ఏకపక్షంగా పార్లమెంట్​లో ఆమోదించారు. ఈ కొత్త చట్టాలు డిసెంబర్​ 2023 నాడు పార్లమెంట్​లో ఆమోదం పొందాయి. అయితే, వీటిని  ఆమోదించేముందు పార్లమెంట్​లోని ఉభయ సభల్లోని 144 సభ్యులను సభ నుంచి సస్పెండ్​ చేశారు. ఈ కొత్త చట్టాలపై ఎలాంటి చర్చ జరగకుండా కొన్ని నిమిషాల్లో పార్లమెంట్​లో ఆమోదం పొందాయి. కొత్త చట్టాలను పార్లమెంట్​ స్టాండింగ్ కమిటీకి పంపించారు.  అయితే కమిటీ విభేదించిన అంశాలను  ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అంటే ఈ చట్టాల పునాది అనేది సరిగ్గా లేదు. ‘రాజద్రోహం’ అన్న నిబంధనని  చట్ట పరిధి నుంచి తొలగించామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే, దాన్ని మరో నిబంధనలో పొందుపరిచారు. ఈ నిబంధనని చట్టం నుంచి తొలగిస్తున్నామని హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్​లో చాలా గర్వంగా చెప్పారు. అది అంతమైందని కూడా అన్నారు. కానీ, ఆ నిబంధన బీఎన్ఎస్​లో మరో రూపంలో వచ్చేసింది. రాజద్రోహం అన్న పదాన్ని మాత్రమే తొలగించి, అంతకన్నా కఠినమైన నిబంధన సెక్షన్​152ని చేర్చారు. దాని ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకి భంగం కలిగిస్తే  ఈ నిబంధన ప్రకారం నేరం అవుతుంది. ఈ నేరం చేసిన వ్యక్తులకు జీవితఖైదుగానీ, ఏడు సంవత్సరాల శిక్షనుగానీ, ఈ శిక్షతోపాటు జరిమానాని కూడా కోర్టులు విధిస్తాయి. 

కేసుల విచారణల్లో జాప్యం

 నేరాలను నిర్ధారించే శాసనాలు అంటే  వ్యక్తులు చెప్పే చట్టాలు గతానికి వర్తించడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 (1)కి ఇది విరుద్ధం. అయితే,  ప్రొసీజర్​కి సంబంధించిన శాసనాలు గతంలో జరిగిన నేరాలకి కూడా వర్తింపచేయవచ్చు. అయితే అవి ముద్దాయి హక్కులకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు. దీని గురించి వాదనలు కోర్టుల్లో  కొనసాగే అవకాశం ఉంది. దానివల్ల కేసుల పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. బీఎన్ఎస్ఎస్​ చట్టంలోని 533 నిబంధన ప్రకారం ఈ కొత్త చట్టాల అమలుకు ముందున్న విచారణల్లో, దర్యాప్తుల్లో, అప్పీలు విచారణల్లో పాత చట్టంలోని ప్రొసీజర్​నే అన్వయించాల్సి ఉంటుంది. కానీ, ఎవరైనా కొత్త చట్టంలోని నిబంధనలను అన్వయించమని కోర్టులను కోరే అవకాశం ఉంది. అప్పుడు కేసుల విచారణల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ, బీఎన్ఎస్ఎస్​లోని సెక్షన్​ 533 చాలా స్పష్టంగా ఉంది. దాని ప్రకారం జులై1కి ముందు జరిగిన నేరాలకి సంబంధించిన పాత చట్టాలే వర్తిస్తాయి. . 

టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం

డిజిటలైజేషన్​కి, టెక్నాలజీని వాడకాన్ని ఈ కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో అత్యంత ప్రాధాన్యతని ఇచ్చారు. దర్యాప్తుని అదేవిధంగా కోర్టు పనితీరును డిజిటలైజేషన్​ చేసి గొప్ప మార్పులను క్రిమినల్​ జస్టిస్ సిస్టమ్​లో తీసుకుని వస్తున్నామని హోం మినిస్టర్​ అమిత్​ షా పార్లమెంట్​లో అన్నారు. టెక్నాలజీ అందుబాటులో లేని వ్యక్తులకు ఈ పద్ధతి కష్టం కలిగించే అవకాశం ఉంది. మనదేశంలో కేసులు ఎక్కువగా బీదవారిమీద, అణగారిన వర్గాలపై ఉంటాయి. నిరక్షరాస్యత ఉన్న మనదేశంలో జీపే లాంటి పద్ధతులకి అలవాటుపడిన వ్యక్తులు ఈ టెక్నాలజీకి కూడా అలవాటు పడతారని అంటున్నారు.  సమన్స్ సర్వీస్, అదేవిధంగా సాక్షుల విచారణ, ఫిర్యాదుదారుల విచారణ, కేసుల విచారణ లాంటివి ఎలక్ట్రానిక్​ మోడ్​లో జరుగుతాయని సెక్షన్​ 530లో చెప్పారు. అయితే, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేయాలి. అంతేకాదు దీని వాడకం విషయంలో కోర్టు విచక్షణకి అవకాశం కల్పించారు. ఫోరెన్సిక్​ నిపుణులు విధిగా నేరస్థలాన్ని సందర్శించాల్సి ఉంటుందని కొత్త చట్టం చెబుతుంది. ఈ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నేరస్థలానికి ఫోరెన్సిక్ నిపుణుల కంటే ముందే పోలీసులు

చేతిరాతల అనాలిసిస్, ఫింగర్​ ప్రింటింగ్ విలువలు, అభిప్రాయాలనేవి వ్యక్తిగతమైనవన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు ఎఫ్ఐఆర్​ విడుదల చేయడానికి ముందే పోలీసులు ప్రాథమిక విచారణ చేయవచ్చని కొత్త చట్టంలోని సెక్షన్173 చెబుతున్నది. అలాంటప్పడు ఫోరెన్సిక్​ నిపుణులు నేరస్థలాన్ని ఎప్పడు సందర్శిస్తారు? ఏమి సాధిస్తారు? అన్నిటికంటే ముఖ్యమైన అంశం.. కేసుల నమోదు.  ఈ ప్రక్రియని బాధితులకి కష్టంగా, పోలీసులకు అనుకూలంగా కొత్త నిబంధనలు చెబుతున్నాయి. గత క్రిమినల్​ ప్రోసీజర్​ కోడ్​లోని సెక్షన్​ 154 ప్రకారం కాగ్నిజబుల్ నేర సమాచారం ఆఫీసర్​ ఇన్​చార్జ్​ అధికారికి అందగానే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. లలిత కుమారి వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ యూపీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే. సమాచారంలో కాగ్నిజబుల్​ నేర సమాచారం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే పోలీస్​ అధికారి ప్రాథమిక విచారణ జరపొచ్చన్న విచక్షణాధికారాన్ని పోలీసులుకి ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ తీర్పులోని అంశాన్ని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ఎస్​ చట్టంలో మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల శిక్షను విధించే కేసుల్లో డీఎస్పీ అనుమతి తీసుకుని ప్రాథమిక విచారణ జరపొచ్చని సెక్షన్​ 173 చెబుతున్నది . దానివల్ల పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులకి తీవ్ర నష్టం జరుగుతుంది. పోలీసులకి విశేష అధికారాలు లభిస్తాయి. అవినీతి పెరిగే అవకాశం ఉంది. దర్యాప్తులో జాప్యం జరుగుతుంది.  దానివల్ల బాధితుడికే కాదు సమాజానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నిబంధన మీద రాజ్యాంగ కోర్టులు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. 

కొత్త రాష్ట్రం కోసం గొంతెత్తితే నేరం

కొత్త చట్టం ద్వారా రాజద్రోహం అనేదాన్ని దేశద్రోహంగా మార్చారు. రాజద్రోహాన్ని మించినదాన్ని రూపొందించారు. కొత్త రాష్ట్రం కోసం ఎవరైనా గొంతెత్తితే కూడా ఈ కొత్త నిబంధన ప్రకారం నేరం అవుతుంది. పాత నిబంధనలో  సార్వభౌమత్వం, సమగ్రత అన్న పదాలు లేవు. అవి ఈ కొత్త నిబంధనలో చేర్చారు. అంటే ఈ కొత్త నిబంధన  సెడిషన్​కి మించిన నిబంధన. దీన్ని ప్రభుత్వం తొలగించింది ఏమీలేదు. ఇంకా చెప్పాలంటే అదనపు పదబంధాలను ఈ నిబంధనలో చేర్చింది. ఈ నిబంధన వల్ల చిన్న దొమ్మీ సంఘటనను కూడా దేశ సమగ్రతకి భంగం కలిగిస్తున్నారని ఈ నిబంధన కింద కేసు నమోదు చేసే అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ, గుమికూడి  శాంతంగా నిరసన తెలపలేని పరిస్థితి ఏర్పడుతోంది.  అసమ్మతికి చోటులేని పరిస్థితిని ఈ నిబంధన సృష్టిస్తుంది. ఈ రెండు చట్టాలు అంటే పాత చట్టాలు, కొత్త చట్టాలు రెండూ అమల్లో ఉండటం వల్ల సత్వర న్యాయానికి విఘాతం కలుగుతుంది. పాత చట్టాలని ప్రక్షాళన చేసి కొత్త  చట్టాలు రావడం వల్ల సత్వర న్యాయం లభిస్తుందని ప్రభుత్వం చెప్పడంతోపాటు, అందుకోసం చట్టంలో చాలా విషయాలకి కాల పరిమితిని ఏర్పాటు చేశారు. అయితే అందుకు తగిన చర్యలు తీసుకోకుండా కాల పరిమితిని ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావు. 

పోలీసులకు విశేష అధికారాలు

కొత్త క్రిమినల్ చట్టాల వల్ల పోలీసులకు అపరిమితమైన అధికారాలు లభిస్తున్నాయి. అనవసర నిర్బంధాలు, అధికార దుర్వినియోగం జరిగే అవకాశం మెండుగా ఉంది. అందులో ముఖ్యమైన నిబంధనలు బీఎన్ఎస్ఎస్​లోని 107, 187 రిమాండ్​కు సంబంధించి నిబంధనలు187లో  చెప్పారు. సెక్షన్​ 187 (3) ప్రకారం పోలీస్​ కస్టడీని పోలీసులు గతంలో మాదిరిగా కాకుండా రిమాండ్​ చేసిన మొదటి 15రోజుల్లో కాకుండా 90, 60 రోజుల్లో పోలీస్​ కస్టడీకి పోలీసులు కోరవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో పోలీసులు ఎప్పుడైనా పోలీస్​కస్టడీ కోరవచ్చు. దీనివల్ల ముద్దాయిలు ఎక్కువ కాలం నిర్బంధంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్​ 480 (1)లోని మూడో ప్రొవిజన్​ ప్రకారం పోలీస్​  కస్టడీ తీసుకోవచ్చన్న కారణంగా కోర్టులు ముద్దాయిలకు బెయిల్​ను నిరాకరించడానికి వీల్లేదు. కోర్టులు ఈ రెండు నిబంధనలను ఏవిధంగా వ్యాఖ్యానిస్తాయో చూడాలి. ఈ 60, 90 రోజుల్లో పోలీసులు తమ దర్యాప్తులని పూర్తిచేయని పక్షంలో వాళ్లకి కోర్టులు తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు వచ్చిన తరువాత కూడా 1జులై ముందు జరిగిన కేసులకు క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్​ 167 వర్తిస్తుంది. అంటే ఆ కేసులకి పోలీసులు మొదటి 15రోజుల కస్టడీలోనే పోలీస్​ కస్టడీని కోరాల్సి ఉంటుంది. 

- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్డి (రిటైర్డ్)