హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు!

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు, ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు ఏడుగురు సీనియర్​ న్యాయవాదుల పేర్లను ఓకే చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేసింది. న్యాయ శాఖ అనుమతి తర్వాత ఆ పేర్లను రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత నియామకాలు చేపడతారు. గతేడాది అక్టోబర్​ 9న అప్పటి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఏడుగురు న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా నియమించాలంటూ సుప్రీంకు ప్రతిపాదనలు పంపింది. ఆ పేర్లకు గవర్నర్, సీఎం సమ్మతిని తెలిపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం ఆమోదముద్ర వేసింది. తెలంతగాణ హైకోర్టుకు టి.వినోద్‌కుమార్, ఎ.అభిషేక్‌ రెడ్డి, కె.లక్ష్మణ్‌ పేర్లను.. ఏపీ హైకోర్టుకు ఆర్‌.రఘునందన్‌రావు, బి.దేవానంద్, డి.రమేష్, ఎన్‌.జయసూర్య పేర్లను న్యాయ శాఖకు సిఫార్సు చేసింది. సాధారణంగా సుప్రీం కొలీజియం ఓకే చేస్తే.. దాదాపుగా ఆ నియామకాలు జరిగిపోయినట్టే. న్యాయ శాఖ, రాష్ట్రపతి ఆమోదముద్ర లభించాక నియామకాలు జరుగుతాయి.