టీమిండియాలోకి ముగ్గురు కొత్తోళ్లు..

టీమిండియాలోకి ముగ్గురు కొత్తోళ్లు..
  • టీమిండియాలోకి సూర్య, ఇషాన్​, తెవాటియా
  • భువీ రీఎంట్రీ, బుమ్రాకు రెస్ట్‌‌‌‌
  • వరుణ్‌‌ చక్రవర్తికి చోటు
  • ఇంగ్లండ్‌‌తో టీ20 సిరీస్‌‌ టీమ్​

ముంబై: ఐపీఎల్‌‌‌‌ హీరోలు సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, రాహుల్‌‌ తెవాటియా తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌‌తో జరిగే ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌కు ఎంపికయ్యారు. మొతెరా స్టేడియం వేదికగా మార్చి 12–20 తేదీల్లో జరిగే  ఈ సిరీస్‌‌ కోసం ఆలిండియా సీనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ 19 మందితో కూడిన టీమ్‌‌ను శనివారం ఎంపిక చేసింది. ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌‌కప్‌‌కు ఇండియా ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీకు బలమైన జట్టు రెడీ చేసుకునేందుకు సెలెక్టర్లు ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌ను ఉపయోగించుకోనున్నారు. దీంతో యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్‌‌లో టాప్‌‌ పెర్ఫార్మర్లకు చాన్స్‌‌ ఇచ్చారు. ముంబై ఇండియన్స్‌‌ ప్లేయర్లు సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌.. రాజస్తాన్‌‌ రాయల్స్‌‌కు ఆడిన రాహుల్‌‌ తెవాటియాను టీమ్‌‌లోకి తీసున్నారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌కు ఎంపికైన మనీశ్‌‌ పాండే, సంజు శాంసన్‌‌, మయాంక్‌‌ అగర్వాల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌ ను పక్కనపెట్టారు. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌‌లో యంగ్‌‌ వికెట్‌‌కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ 13 ఇన్నింగ్స్‌‌లో 516 రన్స్‌‌ చేశాడు. ముంబైకే ఆడిన సూర్య 15 ఇన్నింగ్స్‌‌లో 480 పరుగులు చేశాడు. స్పిన్‌‌ బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ అయిన రాహుల్‌‌ తెవాటియా 11 ఇన్నింగ్స్‌‌లో 255 రన్స్‌‌ చేశాడు. బౌలింగ్‌‌లో పది వికెట్లు తీశాడు. ఐపీఎల్‌‌తోపాటు డొమెస్టిక్‌‌ లెవెల్‌‌లోనూ మంచి రికార్డున్న  సూర్యను ఆస్ట్రేలియా టూర్‌‌కు ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. సెలెక్టర్లు తనను పక్కనపెట్టినప్పటికీ సూర్య.. లీగ్‌‌లో మరింత బాగా పెర్ఫామ్‌‌ చేసి ఎట్టకేలకు టీమిండియా పిలుపు అందుకున్నాడు. కీపర్​ రిషబ్‌‌ పంత్‌‌కు బ్యాకప్​గా కిషన్‌‌ చోటు దక్కించుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా సిరీస్‌‌కు ఎంపికై ఫిట్‌‌నెస్‌‌ ఇష్యూస్‌‌ వల్ల లాస్ట్‌‌ మినిట్‌‌లో జట్టుకు దూరమైన కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ స్పిన్నర్‌‌ వరుణ్‌‌ చక్రవర్తికి సెలెక్టర్లు మరో చాన్స్‌‌ ఇచ్చారు. గత ఐపీఎల్‌‌లో కోల్‌‌కతా తరఫున వరుణ్‌‌ 17 వికెట్లు తీశాడు.  ఇక, వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా సీనియర్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు సెలెక్టర్లు ఈ సిరీస్‌‌ నుంచి రెస్ట్‌‌ ఇచ్చారు. ఇంజ్యురీ నుంచి రికవర్‌‌ అవుతున్న షమీని కూడా ఎంపిక చేయలేదు. లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ నటరాజన్‌‌ ప్లేస్‌‌ నిలబెట్టుకోగా సీనియర్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

టీమ్: విరాట్‌‌‌‌ కోహ్లీ(కెప్టెన్‌‌), రోహిత్‌‌ శర్మ(వైస్‌‌ కెప్టెన్‌‌), కేఎల్‌‌ రాహుల్‌‌, శిఖర్‌‌ ధవన్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌, సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, రిషబ్‌‌ పంత్‌‌(కీపర్‌‌), ఇషాన్‌‌ కిషన్‌‌(కీపర్‌‌), యజ్వేంద్ర చహల్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి, అక్షర్‌‌ పటేల్‌‌, వాషింగ్టన్‌‌ సుందర్‌‌, రాహుల్‌‌ తెవాటియా, నటరాజన్‌‌, భువనేశ్వర్‌‌ కుమార్‌‌, దీపక్‌‌ చహర్‌‌, నవదీప్‌‌సైనీ, శార్దూల్‌‌ ఠాకూర్‌‌.

For More News..

పెట్రో రేట్ల గురించి కేంద్ర, రాష్ట్రాలు మాట్లాడుకోవాలి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన నవోమి ఒసాకా

త్వరలో యోనో మర్చంట్‌ యాప్‌