
- ఏడుపాయల దుర్గమ్మ తొవ్వలో అరుదైన చిత్రాల గుర్తింపు
మెదక్/పాపన్నపేట, వెలుగు: ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న మెతుకుసీమలో పలు చోట్ల ఆది మానవుల కాలం నాటి రాతి చిత్రాలు బయటపడుతున్నాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో జిల్లాలో పలుచోట్ల ఆది మానవులు ఆవాసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలు (రాక్ షెల్టర్స్), రాతి బండలపై ఆనాటి రాతి చిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల కొల్చారం మండలంలో కొన్ని చిత్రాలు వెలుగులోకి రాగా, తాజాగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల దుర్గమ్మ ఆలయ తొవ్వలో మూడు కొత్త రాతిచిత్రాల స్థావరాలు గుర్తించారు. ఇందులో అరుదైన రాతి చిత్రాలు వెలుగు చూశాయి.
మెదక్ జిల్లాలో పలు చోట్ల..
హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట, మెదక్ మండలం వెంకటాపూర్, మెదక్ పట్టణ శివారులోని బారా కమాన్, వెల్దుర్తి మండలం బస్వాపూర్, కుకునూర్, హస్తాల్ పూర్, రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్ తదితర ప్రాంతాల్లో ఆది మానవుల ఆనవాళ్లు, రాతి చిత్రాలు బయటపడ్డాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో కొద్ది రోజుల కింద కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామ శివారులోని పాత శివాలయం గుట్ట మీద నవీన రాతియుగం ఆనవాళ్లు వెలుగు చూశాయి. ఆది మానవులు వేట కోసం ఉపయోగించిన రాతి పనిముట్లు, పదును చేయడానికి వినియోగించిన నూరుడు గుంతలు గుర్తించారు. క్రీస్తు పూర్వం 5 వేల సంవత్సరాల కింద ఆది మానవులు ఈ ప్రాంతంలో నివసించినట్లు అక్కడ లభించిన ఆధారాల ద్వారా అంచనాకు వచ్చినట్లు చరిత్ర పరిశోధకుడు తెలిపారు.
ఏడుపాయల దుర్గమ్మ తొవ్వలో...
తాజాగా కొత్త జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్పల్లిలో ఏడుపాయల దుర్గా భవాని ఆలయం దారిలో నాగసాన్పల్లి గుట్టల్లో రెండు చోట్ల మూడు రాతిచిత్రాల తావులను, అరుదైన రాతిచిత్రాలను గుర్తించినట్టు తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సంతోష్ తెలిపారు. ఎరుపురంగు రాతి చిత్రాలలో రంగు నింపిన పెద్దబొమ్మ, ఒక చేప, మచ్చల జంతువులు, పెద్ద సూర్యుడు, ఎముక, రెండు కంగారు వంటి జంతువులు, మాస్కు ధరించిన ఒక పెద్ద మానవరూపం, వజ్రాకార డిజైన్, జిగ్ జాగ్ గీతలు, నిలువు గీతల డిజైన్లు, పెద్దతోక, పెద్దమెడ, పెట్టె వంటి శరీరం డైనోసార్ మాదిరిగా కనిపించే ఒక మాంసాహార జంతువుతో పాటు పలు చిత్రాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాతి చిత్రాలన్నీ ఔట్ లైన్ స్కెచెస్ తరహాలోనే ఉన్నాయని తెలిపారు.
రాక్ షెల్టర్స్..
నాగసాన్పల్లి శివారులోని గుర్రపు కొండ, రాయికొండ మీద ఉన్న బండలపై గుర్తించిన రాతి చిత్రాల శైలి, ఎరుపు రంగులో చిత్రించిన పద్ధతి, రంగులు నింపడాన్ని బట్టి అవి చివరి మధ్యరాతి యుగంలో వేసినవిగా, 10 వేల సంవత్సరాల కిందివిగా భావిస్తున్నట్లు రాతి చిత్రాల నిపుణులు సంతోష్, సలహాదారులు బండి మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆది మానవులు నదికి దగ్గరగా తమ ఆవాస ప్రాంతాలు(రాక్ షెల్టర్స్) ఏర్పాటు చేసుకునే వారు. కింద ఒక బండ, పైన ఒక బండ ఉండటం ఇందుకు నిదర్శనం. రాక్ షెల్టర్స్ కింద అప్పట్లో వారు వినియోగించిన పనిముట్ల ఆనవాళ్లు, పనిముట్లు పదును చేసినట్లు తెలిపే నూర్పిడి గుంతలు(గ్రూమ్స్) అగుపిస్తాయి. అలాగే ఆది మానవులు తాము అప్పట్లో చూసిన జంతువుల గురించి భవిష్యత్తు తరాలకు తెలిసేలా రాతి బండల మీద బొమ్మలు వేశారు. నాగసాన్పల్లి వద్ద వారు ఆవాస ప్రాంతం ఏర్పాటు చేసుకున్న చోట నది, పక్కన అడవి ఉండడంతో చేపలు, అడవి పందులు, ఎలుగు బంటి బొమ్మలు రాళ్లపై చిత్రించినట్లు భావిస్తున్నారు.