
మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఎంపీవో నరేశ్, కింద తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి బాల సైదులును సస్పెన్షన్చేస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రస్తుతం పని చేస్తున్న గ్రామ కార్యదర్శి ప్రవీణ్, గతంలో పని చేసిన విజయలక్ష్మి, జైసన్ రాజ్‌ను డీపీవో ఆఫీస్‌కు అటాచ్ చేశారు. మఠంపల్లి మండలం చెన్నాయపాలెం పరిధిలోని కింది తండాను గ్రామపంచాయతీగా గుర్తించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని తండాకు చెందిన బాబురావు నాయక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
విచారణ అనంతరం అధికారులు అంతా సక్రమంగానే ఉందని నివేదిక ఇచ్చారు. నివేదికపై సంతృప్తి చెందని బాబురావు నాయక్ వార్డుల ఎంపిక సక్రమంగా లేదని పై తండాకు చెందిన 40 ఓట్లను కింది తండాలో కలిపారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఎలక్షన్ కమిషనర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మరోసారి విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో పలువురు ఆఫీసర్లపై వేటు వేశారు.