- మూడు జిల్లాల పరిధిలో ఉన్న నియోజకవర్గం
- సెగ్మెంట్లో సెకండ్ టైమ్ఎమ్మెల్యే సెంటిమెంట్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పాతవారే కావడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 5సార్లు ఆ పార్టీనే గెలవగా.. ఒకసారి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.
త్రిముఖ పోటీ..
చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే మళ్లీ అవకాశం ఇవ్వగా, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం పోటీ పడుతున్నారు. ముగ్గురు పాతవాళ్లే కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ గత ఐదేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ముందుగానే తన సీటు ప్రకటించడంతో నెలరోజుల నుంచే ప్రచారం మొదలు పెట్టారు. నారాయణపూర్ ఎడమ కాల్వ పూర్తి చేయడం, నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, రామడుగు మండలంలోని మోతె రిజర్వాయర్ నిర్వాసితులకు అత్యధిక పరిహారం ఇప్పించడం, కొండగట్టు ఆలయ అభివృద్ధి, పోతారం రిజర్వాయర్ పూర్తి చేయడం, గంగాధర -లక్ష్మీదేవిపల్లి మధ్య నారాయణపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణం, గంగాధర మండలం ర్యాలపల్లి శివారు నుంచి మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కు లింక్ కెనాల్ నిర్మాణం. చొప్పదండి సీహెచ్ సీని వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్చేయించడం తదితర పనులు వివరిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
బీఆర్ఎస్ వైఫల్యాలపై ఫోకస్..
బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఆమె హయాంలోనే చొప్పదండి మండలం రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్, చొప్పదండిలో డిగ్రీ కాలేజీ మంజూరయ్యాయి. చొప్పదండి మండలం గుమ్లాపూర్ క్రాస్ రోడ్డు నుంచి రామడుగు వరకు డబుల్ రోడ్డు, చొప్పదండి మండలం రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేశారు. చాలా మంది ఒంటరి మహిళలకు పింఛన్ ఇప్పించారు. ఈ పనులను గుర్తు చేయడంతోపాటు, బీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సానుభూతి, రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలపై ఆశ పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు.
ముగ్గురికీ అసమ్మతి
ఇక్కడ ముగ్గురు అభ్యర్థులను సొంత పార్టీల్లో అసమ్మతి నేతల బెడద భయపెడుతోంది. రవిశంకర్ పై అసమ్మతి ఉండగా పార్టీ పెద్దలు అసంతృప్త నేతలను బుజ్జగించారు. ప్రస్తుతానికి అసమ్మతి నేతలు ఎమ్మెల్యేతోపాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జయపాల్రెడ్డి మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. జయపాల్రెడ్డి మిత్రమండలి పేరిట ఆయన ఆరు మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గమంతటా ఆయనకు అనుచరులున్నారు. ఆయన చేరిక రవిశంకర్ కు ప్లస్ అవుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన లీడర్లు నాగి శేఖర్, వెన్నం రాజమల్లయ్య పార్టీ క్యాండిడేట్సత్యంకు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొడిగె శోభకు ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య సహకరించకపోవచ్చని అంటున్నారు. చొప్పదండి నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాలు కరీంనగర్ జిల్లాలో, బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో, కొడిమ్యాల, మల్యాల మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. సెగ్మెంట్లో186 గ్రామాలుండగా బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే సగానికి పైగా గ్రామాలను చుట్టేశారు. సత్యం మండలానికో నాలుగైదు గ్రామాలు, శోభ రోజూ ఐదు నుంచి 8 గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ప్రభావం చూపే అంశాలివే..
చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 30 ఎకరాల్లో లెదర్ పార్క్ ను 20 ఏండ్ల కింద అప్పటి ఎంపీ సీహెచ్. విద్యాసాగర్ రావు ప్రతిపాదించారు. దీంతో ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుందని, లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని దళిత సంఘాలు, లెదర్ పార్క్ ఏర్పాటు ఉద్యమ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు, దీక్షలు చేశారు. ప్రతిసారి లెదర్ పార్కు ప్రచార అస్త్రంగా మారుతుందే తప్ప ఏర్పాటుకు ఎవరూ చొరవ చూపలేదు.
నాలుగేళ్ల కింద చొప్పదండి మున్సిపాలిటీగా ఏర్పడింది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. పట్టణాన్ని డెవలప్ చేస్తామని హామీలైతే ఇస్తున్నా, పనులు జరగడం లేదు. రామడుగు మండలం గోపాల్ రావుపేటను, గంగాధర మండలం గర్శకుర్తిని మండలాలుగా చేయాలనే డిమాండ్ ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టుతో సుమారు ఐదు వేల కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. వాళ్ల కోసం ఆర్అండ్ఆర్ కాలనీలను నిర్మించారు. డబుల్ బెడ్రూం స్కీమ్ కింద రూ.5 లక్షల 4 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ 2015 జూన్ 18న హామీ ఇచ్చినా నెరవేరలేదు.
రెండోసారి గెలుస్తారా?
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చొప్పదండి ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చేది ఒక పార్టీ అయితే .. చొప్పదండి ప్రజలు మరోపార్టీని ఆదరించేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రమే అధికారంలోకి వచ్చిన పార్టీకే ఇక్కడి ఓటర్లు కూడా పట్టం కట్టారు. నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే న్యాలకొండ రామకిషన్ రావు మాత్రమే 1985, 89, 95 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ రికార్డు సాధించారు. ఆయన తప్ప మరెవరూ రెండోసారి గెలవలేదు.