
- మరో రెండు దశాబ్దాల్లో మరింత పెరగనున్న క్యాన్సర్ మరణాల రేటు
- అమెరికా, చైనా తర్వాత భారత్లోనే ఎక్కువ కేసులు
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి
- పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువ ప్రభావమని వార్నింగ్
న్యూఢిల్లీ: మన దేశంలో క్యాన్సర్ వల్ల ప్రతి ఐదుగురిలో ముగ్గురు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే క్యాన్సర్ మరణాలలో 10% కంటే ఎక్కువ భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) నివేదిక వెల్లడించింది. గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ డేటాబేస్‌లను ఉపయోగించి రూపొందించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. క్యాన్సర్ మరణాల్లో చైనా మొదటి స్థానంలో నిలవగా..మన దేశం రెండవ స్థానంలో ఉంది. క్యాన్సర్ వల్ల అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు చనిపోతుండగా.. చైనాలో ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు. క్యాన్సర్ కేసులు పెరుగుదల విషయంలో చైనా, అమెరికా తర్వాతి స్థానంలో మన దేశమే ఉన్నట్లు తేలింది. రాబోయే రెండు దశాబ్దాలలో భారతదేశం మరిన్ని క్యాన్సర్ కేసులను, మరణాలను చూడాల్సి వస్తుందని రిపోర్ట్ పేర్కొంది.
2012 నుంచి 2022 మధ్య 9 లక్షల మంది మృతి
మన దేశంలో 2012 నుంచి 2022 మధ్య క్యాన్సర్ ప్రభావం 36% పెరిగింది. 2012లో 10 లక్షల మంది క్యాన్సర్ బాధితులు ఉండగా..2022నాటికి ఆ సంఖ్య 13 లక్షలకు పెరిగింది. అదేవిధంగా..క్యాన్సర్ మరణాలు కూడా 30.3%కి పెరిగాయి. 2012లో 6 లక్షల మంది చనిపోగా..2022నాటికి ఆ సంఖ్య 9 లక్షలకు చేరింది. 2022 నుంచి 2050 మధ్య ఈ సంఖ్య18 లక్షలకు చేరే ప్రమాదం ఉందని రిపోర్ట్ పేర్కొంది. అయితే, భారతదేశంలో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు వాస్తవానికి ఉన్నదానికంటే తక్కువగా కనిపిస్తుంది.
మహిళల్లో ఏ క్యాన్సర్ ఎక్కువంటే..!
గడిచిన 20 ఏండ్లల్లో వివిధ వయసుల రీత్యా స్త్రీ, పురుషుల్లో 36 రకాల క్యాన్సర్‌లను రిపోర్ట్ గుర్తించింది. పురుషుల కంటే మహిళలపైనే క్యాన్సర్ ఎక్కువ ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఒక ఏడాదిలో పురుషుల క్యాన్సర్ మరణాలు 1.2- నుంచి 2.4% మధ్య ఉంటే.. స్త్రీలలో మాత్రం1.2 నుంచి 4.4% గా ఉంది. రొమ్ము క్యాన్సర్ వల్ల మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతుండగా.. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మహిళలు, పురుషుల్లోనూ అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్ మూడో అతిపెద్ద కారణమని రిపోర్ట్ వివరించింది. మహిళల్లో వచ్చే కొత్త క్యాన్సర్ కేసుల్లో దాదాపు 30% రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించినవే ఉన్నయి. దీని తరువాత గర్భాశయ క్యాన్సర్ కేసులు దాదాపు 19% ఉన్నాయి. పురుషులలో నోటి క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నది.
ఏ వయసులో క్యాన్సర్ వస్తుందంటే..!
మన దేశంలో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు వాస్తవానికి ఉన్నదానికంటే తక్కువగా కనిపిస్తున్నది. యువత కంటే వృద్ధులు క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. దేశంలో ప్రస్తుతం యువతే ఎక్కువగా ఉంది కాబట్టి..రాబోయే కొద్ది రోజుల్లోనే వారంతా వృద్ధులుగా మరడంతో క్యాన్సర్ రేటు పెరుగుతుందని రీపోర్ట్ పరిశోధకులు వెల్లడించారు.
క్యాన్సర్ కేసులు ఎక్కువగా 70 నుంచి అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. ఆ తరువాత 15 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గలవారిలో క్యాన్సర్ కేసులు కనిపిస్తాయన్నారు. క్యాన్సర్ మరణాలలో 20 శాతం 15 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు వారివేనని తెలిపారు. అందుకే ఈ వయస్సు వారు జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. కాగా..దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ భూతాన్ని చంపడానికి ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిందేనని రిపోర్ట్ పేర్కొంది.