Pakistan Cricket: హద్దుమీరిన పాక్ క్రికెటర్లు.. ఒకేసారి ముగ్గురికి జరిమానా

Pakistan Cricket: హద్దుమీరిన పాక్ క్రికెటర్లు.. ఒకేసారి ముగ్గురికి జరిమానా

ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పాకిస్తాన్ క్రికెటర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఒకేసారి ముగ్గురికి జరిమానా విధించింది. అంతేకాదు, వీరి ఖాతాలో ఒక్కొక్క డీమెరిట్ పాయింట్ విధించింది గత 24 నెలల్లో ఈ ముగ్గురూ ఎటువంటి తప్పులు చేయకపోవడంతో బయటపడ్డారు. లేదంటే నిషేధం వేటు పడేది. 

రెచ్చగొట్టే చేష్టలు..

కరాచీ, నేషనల్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో పాక్ ఆటగాళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో సఫారీ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే సింగిల్ పరుగెత్తుతుండగా షాహీన్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. పైగా సఫారీ బ్యాటర్ దే తప్పన్నట్లు అతనితో వాదనకు దిగాడు.

మరో ఘటనలో   దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో టెంబా బావుమా రనౌట్ అవ్వగా.. పాక్ ఫీల్డర్లు సౌద్ షకీల్, కమ్రాన్ గులాంలు అతన్ని తోసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆ పరిస్థితులలో కోహ్లీ వంటి ప్లేయర్ ఉంటే.. భారీ గొడవే జరిగేది. అటువంటి సెలెబ్రేషన్స్ అన్నమాట.

పై రెండు ఘటనలపైనా ఐసీసీ చర్యలు తీసుకుంది. ప్రత్యర్థి ఆటగాడి పట్ల అనుచిత ప్రవర్తన, శారీరక సంబంధం పెట్టుకున్నందుకు ఆర్టికల్ 2.12 ఉల్లంఘన కింద షహీన్‌ ఆఫ్రిది మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఇక బావుమాకు దగ్గరగా సంబరాలు జరుపుకున్న ఇద్దరు క్రికెటర్లకు ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఈ ముగ్గురు జరిగిన తప్పులను అంగీకరించినందున.. వీరిపై ఎటువంటి విచారణ ఉండదని ఐసీసీ తెలిపింది.