- గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
- జీవన్ రెడ్డి రాకతో హస్తం శ్రేణుల్లో జోష్
- ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న ఎంపీ అర్వింద్
- ఇంటిని చక్కదిద్దే పనిలో బాజిరెడ్డి
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదలగా కనిపిస్తోంది. గతంలో ఈ సెగ్మెంట్ హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. దీంతో ఈ సారి కచ్చితంగా విజయం సాధించేందుకు సీనియర్ నేత వివాదరహితుడు జీవన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారాన్ని నెల కిందటే ప్రారంభించారు. బీఆర్ ఎస్ ఈ సారి సీఎం కేసీఆర్ కవితను కాకుండా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలోకి దింపింది. ముగ్గురు ప్రధానపార్టీల క్యాండిడేట్లు తేలడంతో పోరు హోరాహోరీ అనేలా ప్రచారం సాగుతోంది.
ఎంపిక దగ్గరి నుంచే కాంగ్రెస్ జాగ్రత్తలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది. దానికి తోడు పార్టీలోకి నిత్యం వలసలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇందూరు స్థానాన్ని గెలుచుకునే లక్ష్యంతో పార్టీ హైకమాండ్ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ లీడర్స్ ఒపీనియన్ తెలుసుకోవడం మొదలు ఫ్లాష్ సర్వే చేసి జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు మంచి పట్టు ఉండడం ఇందూర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండడం కలిసొస్తుందని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయని అధికారంలోకి రావడంతో ఓటింగ్ శాతం ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ గ్రాఫ్‌లో వృద్ధి, గవర్నమెంట్ నాలుగు నెలల్లో అమలు చేసిన గ్యారెంటీలతో ప్రజల్లో ఏర్పడిన నమ్మకం లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. పవర్ కోల్పోయాక బీఆర్‌ఎస్ అనూహ్య రీతితో వీక్కావడం ఒక ఎత్తుకాగా ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో గులాబీ ప్రతిష్ఠ మరింత మసకబారింది. కేవలం పరువు నిలబెట్టుకోడానికి పోటీ చేస్తున్న 'కారు' అసలు కౌంట్‌లో లేదని బీజేపీని సరైన ప్లాన్‌తో ఎదుర్కొంటే గెలుపు పక్కా అనే అంచనాతో కాంగ్రెస్ ఉంది.
అసెంబ్లీలో ఓట్లపై బీజేపీ టెన్షన్
2019 ఎలక్షన్లో గెలిచిన సిట్టింగ్ ఎంపీ అర్వింద్‌ను బీజేపీ మరోసారి పార్లమెంటు అభ్యర్థిగా ఫస్ట్ లిస్టులోనే ప్రకటించింది. టికెట్ ధీమాతో ఆయన నెల రోజుల ముందే ఎన్నికల ప్రచారం షురూ చేసి అందరికంటే ముందున్నారు. కమలదళంతో ఇప్పటికే పలు మీటింగ్‌లు నిర్వహించి ప్రజల వద్దకు వెళ్తున్నారు. కులాల వారీగా కూడా సమావేశమయ్యారు. ఎంపీగా గడిచిన ఐదేండ్లలో రాజకీయ పరిణితి పొందిన ఆయన ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేయడానికి తనను గెలిపించాలని వినూత్నంగా వెళ్తున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆర్మూర్, అర్బన్ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పుడాయనకు అదనపు బలమయ్యారు. అర్వింద్ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఎంపీ టికెట్ కోసం విఫలయత్నం చేసిన ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ వర్గీయులు అభ్యర్థి అర్వింద్‌కు దూరం పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పొందిన ఓట్లు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కంటే తక్కువ ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమైనప్పటికీ ఎక్కడ నెగెటివ్ ఉన్నా పాజిటివ్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
అర్వింద్ టార్గెట్‌గా బీఆర్‌ఎస్ ఎత్తు
2019 ఎలక్షన్లో సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి సంచలన గెలుపు నమోదు చేసుకున్న అర్వింద్ గడిచిన ఐదేండ్లలో పదునైన కామెంట్లతో కల్వకుంట్ల ఫ్యామిలీకి కొరకరాని కొయ్యగా మారారు. అర్వింద్‌ను పాలిటిక్స్ నుంచి ఎప్పుడెప్పుడు తెరమరుగు చేయాలా అనే ఆరాటం ఆ కుటుంబంలో ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో బీఆర్‌ఎస్ పవర్ కోల్పోయింది. పవర్ లో లేక పోయినా అర్వింద్‌ను దెబ్బతీయడానికి అదే సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్దన్ ను బరిలోకి దింపింది.
పవర్‌గేమ్ ఆడే చాన్స్ ఇప్పుడు లేనందున అర్వింద్ టార్గెట్‌గా కులం ఓట్లను చీల్చే ఎత్తుగడతో కారు పార్టీ వ్యుహాలు రచిస్తోంది. కాపు సామాజిక వర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్‌కు లీడర్‌గా మంచి గుర్తింపే ఉంది. గులాబీ నేతలు వరుసగా కారు దిగి వెళ్లిపోతున్నా ఓట్ల చీలిక కలిసొస్తుందనే లెక్కల్లో హైకమాండ్ ఉండగా క్యాడర్ లేకుండా ముందుకు వెళ్లలేమని గ్రహించి సర్దుబాటు ప్రయత్నాల్లో బాజిరెడ్డి ఉన్నారు.