రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నిక వస్తే ఆ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మునుగోడు ఉపఎన్నికలోనూ సత్తా చాటి టీఆర్ఎస్కు మరో షాక్ ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం మునుగోడును గెలుపుపైనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని భావిస్తోంది.
వలసలపై దృష్టి
మునుగోడు నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నికను ఛాలెంజింగ్గా తీసుకుంది. మునుగోడులో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 21న కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు స్థానిక నేతలు బీజేపీలోకి రానుండటం ఆ పార్టీకి కలిసిరానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు వలసలపై ఫోకస్ పెట్టిన నేతలు.. ఇతర పార్టీల నాయకులకు చేర్చుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం
మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నాయకులు అక్కడే మకాం వేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. జనానికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక చేరికల కమిటీ భేటీలో 21న జరగనున్న అమిత్ షా బహిరంగ సభలో ఎవరెవరు పార్టీలో చేరుతారన్న అంశంపై స్పష్టత రానుంరు. వీటితో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 22 తర్వాత బీజేపీ నేతలంతా మునుగోడులోనే మకాం వేసి ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని డిసైడయ్యారు. మొత్తమ్మీద హుజూరాబాద్ తరహాలోనే మునుగోడు ఉపఎన్నికల్లోనూ విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశానికి మరింత చేరువవుతామని బీజేపీ భావిస్తోంది.
జీవన్మరణ పోరాటం
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ కు జీవన్మరణ పోరాటంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై నేతలు ఫోకస్ పెట్టారు. ఉప ఎన్నికలో గెలిస్తేనే పార్టీ బతికి బట్టకడుతుందన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అందుకోసం గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో తొలుత ప్రజల్లోకి వెళ్లాలని, ఆ తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని పీసీసీ నిర్ణయించింది. అసంతృప్తుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జనంలోకి వెళ్లేందుకు సిద్ధం
సిట్టింగ్ సీటు గెలిస్తేనే ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో ఆజాదీ గౌరవ్ యాత్ర చేపట్టనున్నారు. నారాయణ్ పూర్, చౌటుప్పల్ మండలాల్లో 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. 16 నుంచి 20వ తేదీ వరకు మండలాలవారీగా సమీక్ష నిర్వహించడంతో పాటు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు, రాజగోపాల్ రాజీనామా వెనుక కారణాలను ప్రజలకు వివరించాలని నేతలు భావిస్తున్నారు.
బీజేపీకి దీటుగా సభ
21న అమిత్ షా సభకు ధీటుగా కాంగ్రెస్ సభ నిర్వహించాలని భావిస్తోంది. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పాల్వాయ్ స్రవంతి, కైలాష్ నేత తదితర నేతలను ఏఐసీసీ సెక్రటరీలు గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడుతున్నారు. మరోవైపు పార్టీ క్యాడర్ రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండాతీసుకోవాల్సిన చర్యల గురించి నేతలు వ్యూహాలకు పదనుపెడుతున్నారు.
బీజేపీ కన్నా ముందే సభ
టీఆర్ఎస్ పార్టీకి సైతం మునుగోడు ఉప ఎన్నిక కీలకం కానుంది. గత ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆ పార్టీ మునుగోడు బై ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే గురువారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అమిత్ షా కన్నా ముందే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 20 మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సభా వేదిక కోసం మంత్రి జగదీశ్ రెడ్డి నారాయణపురం, చండూరు, మునుగోడులో స్థల పరిశీలన చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సభాస్థలిని ఫైనల్ చేయనున్నారు.
అభ్యర్థిపై స్థానికంగా వ్యతిరేకత
ఇదిలా ఉంటే మునుగోడు అభ్యర్థి ఎవరన్న విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే జిల్లాకు చెందిన 90శాతం మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జగదీశ్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆయన అభిప్రాయం మేరకు సీఎం కేసీఆర్ కూసుకుంట్ల వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు బైపోల్ ఎందుకు వచ్చిందన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మనుగోడు ఉప ఎన్నిక ఫలితం మీదే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని, అది గెలవకపోతే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 20న జరగనున్న సభ అనంతరం టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది.