బస్సులో ముగ్గురికి కరోనా.. ఆందోళనలో మిగతా ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా
ఆందోళనలో మిగతా ప్రయాణికులు

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వచ్చిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మొత్తం 21 మంది ప్రయాణికులతో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరింది. రాత్రి 9 గంటలకు నిర్మల్ కు చేరుకోగా 13 మంది దిగారు. మరో ఏడుగురు ఎక్కారు. మొత్తం 13 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ కు చేరుకుంది. ప్రయాణికులు ఎక్కడి వారక్కడ వెళ్లిపోయాక.. బస్సులో ముగ్గురు కరోనా పాజిటివ్ వచ్చిన వారున్నారని హైదరాబాద్ నుంచి పోలీసు ఆఫీసర్లకు సమాచారం వచ్చింది. దీంతో వారు ఆర్టీసీ ఆఫీసర్లను అప్రమత్తం చేశారు. బస్సు తిరిగి హైదరాబాద్ వెళనీయకుండా శానిటైజ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఆదిలాబాద్లోనే ఉంచారు. పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి రిమ్స్ కు తరలించారు. అయితే బస్సులో ప్రయాణించిన వారిలో ఆందోళన మొదలయ్యింది. బస్సులో ప్రయాణించిన వారి వివరాల సేకరణకు పోలీస్ శాఖవారు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన వారున్నారనే సమాచారం తెలిసినా.. రాత్రి 8 గంటల వరకు కూడా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు వారిని హెచ్చరించారక నిర్లక్ష్యం వహించారు. బస్సులో ప్రయాణించిన వారు ఎంతమందిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారనే దానిపై తీవ్ర ఆందోళన మొదలయ్యింది.

అయితే ఈ విషయంపై ఆదిలాబాద్ డీఎంహెచ్వో స్పందించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘నిన్న మధ్యాహ్నం 3:30కి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ కు రాత్రి 10:30 చేరుకున్న సూపర్ లగ్జరీ బస్ (TS08Z0229) లో ప్రయాణించిన వాళ్ళలో ముగ్గురు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రయాణించారు. కావున ఆ బస్ లో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు స్వచ్చందంగా రిమ్స్ హాస్పిటల్ కి వచ్చి కరోనా టెస్టులు చేయించుకోగలరు’అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

For More News..

టిక్‌టాక్‌ బ్యాన్‌తో.. హైదరాబాద్ యాప్ కు జోష్

వీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం

దుకాణాలు, సూపర్ జజార్లలో ఎక్స్ పైరీ ఫుడ్ ఐటమ్స్