- హస్తినలో మకాం వేసి లాబీయింగ్
- టికెట్‌కోసం ఇప్పటికే ముగ్గురి ప్రయత్నాలు
- సంజీవరెడ్డి రాకతో నాలుగుకు చేరిన ఆశావహులు
- టికెట్‌పై కేడర్‌లో ఉత్సాహం
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి అల్లుడు అల్లూరి సంజీవరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాంచంద్రారెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడిగా ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏండ్ల తరబడి మాజీ మంత్రి వెంట ఉన్న అభిమానవర్గం అల్లూరికి మద్దతు తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసం సాజిద్ ఖాన్, సుజాత, కంది శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతున్నారు.
అయితే కందికి టికెట్ ఇవ్వకూడదని.. తమ ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని వారు హైకమాండ్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే టికెట్ కోసం ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పార్టీ పెద్దలను కలిసేందుకు సంజీవ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
రాంచంద్రారెడ్డి వర్గం.. సంజీవరెడ్డి బలం
మాజీ మంత్రి రాంచంద్రారెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉండేది. ఆయన మరణం తర్వాత ఆ ఓటు బ్యాంకుతో పాటు మాజీ మంత్రి అనుచరులు సంజీవరెడ్డి పోటీలో ఉండాలని కోరుకుంటున్నారు. వారి ఒత్తిడి మేరకు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలో సింగిల్ విండో చైర్మెన్ గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇండ్లు, ఏజెన్సీ లో ఆర్ఎఫ్ఆర్వో భూములకు లోన్లు, తదితర పథకాలు మంజూరు చేయడంలో కృషి చేసిన తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
ఎవరి పంథా వారిదే..
ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం అప్లై చేసుకున్న కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మొదటి లిస్ట్ రిలీజ్‌కాకముందే కంది శ్రీనివాస్ రెడ్డి తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ లిస్ట్ లో ఆదిలాబాద్ అభ్యర్థినే ప్రకటించలేదు. దీంతో అధిష్ఠానం ఎవరికి టికెట్ఇస్తుందా అని నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెకండ్ లిస్ట్ లో నైనా తమ పేరు ఉండేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతతో పాటు, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సైతం టికెట్ కోసం భారీ స్థాయిలో లాబీయింగ్చేస్తున్నారు.
సంజీవరెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఒక పక్క నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే.. మరోపక్క టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ నేతలు బిజీ అయిపోయారు. మరో రెండు రోజుల్లో రెండో లిస్ట్ వస్తుండటంతో ఆలోగా తాము చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ఎవరిని వరిస్తుందోనని పార్టీ కేడర్ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.