హనుమకొండ జిల్లా గోడ కూలి ముగ్గురి మృతి

  •     హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఘటన
  •     రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కూలిన పాత ఇంటి గోడ

శాయంపేట, వెలుగు : పాత ఇంటి గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో జరిగింది. శాయంపేటకు చెందిన మోరె సాంబయ్య (60), లోకలబోయిన సారలక్ష్మి(50), భోగి జోగమ్మ (60), పొట్టకారి సుభద్ర, మార్త స్వప్న, పోచమ్మ, పుష్పక్క, కళావతి, మోరె మల్లమ్మ మరో ఇద్దరితో కలిపి మొత్తం 11 మంది గత నెల ఆసరా పింఛన్ తీసుకోవడానికి శుక్రవారం పోస్టాఫీసుకు వెళ్తున్నారు. రోడ్డు పక్కనే శిథిలావస్థకు చేరిన ముష్క భాగ్యలక్ష్మికి చెందిన పాత ఇల్లు.. గురువారం రాత్రి కురిసిన వర్షానికి బాగా నానడంతో అటుగా వెళ్తున్న వారిపై ఒక్కసారిగా కూలింది. దీంతో సాంబయ్య, సారలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా, జోగమ్మ మార్గమధ్యలో చనిపోయింది.

మోరె సాంబయ్య సిరిసిల్లలో చేనేత కార్మికుడిగా పనిచేస్తూ, అప్పుడప్పుడు కుటుంబసభ్యులను కలిసేందుకు గ్రామానికి వచ్చి పింఛన్​ తీసుకొని పోతుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే, సాంబయ్యతో పాటే ఆయన భార్య మల్లమ్మ కూడా శాయంపేటకు వచ్చింది. శుక్రవారం ఉదయం సిరిసిల్ల వెళ్లేందుకు శాయంపేట మెయిన్‌‌‌‌ రోడ్డు చౌరస్తా వరకు వెళ్లగా, ఆసరా పింఛన్ ఇస్తున్నారని తెలిసి, సాంబయ్య, మల్లమ్మ వెనక్కి వచ్చారు. తన ఎదుటే భర్త చనిపోవడంతో భార్య మల్లమ్మ కన్నీరుమున్నీరు అవుతుంది. 

ఐదుగురు ప్రాణాలు కాపాడిన మహిళ..

ఇంటి గోడ కూలుతున్న సమయంలో సుభద్ర అనే మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఐదుగురు ప్రాణాలను కాపాడినట్లు స్థానికులు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇంటి పక్క నుంచి బాధితులు నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో అటుగా వస్తున్న సుభద్ర అనే మహిళ గమనించి, తన పక్కనున్న స్వప్న, మల్లమ్మ, పుష్పక్క, కళావతి, మరో చిన్నారిని పక్కకు తప్పించింది. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యంతోనే..

ఇంటి గోడ కూలి ముగ్గురు చనిపోవడానికి పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు మండిపడ్డారు. తన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో భాగ్యలక్ష్మి మరో ఇల్లు కట్టుకొని ఉంటోంది. కొడుకు చనిపోవడంతో ఇంటిని కూల్చే స్థోమత ఆమెకు లేక అలాగే, వదిలేసింది. దీంతో కాలనీవాసులు ఆ ఇంటిని కూల్చాలని గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు, సిబ్బందికి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లకు కూల్చివేయాలనే గతంలో ఆఫీసర్లు ఇచ్చిన ఆదేశాలను సిబ్బంది పట్టించుకోలేదు.

వారి నిర్లక్ష్యమే ముగ్గురు చనిపోవడానికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న వరంగల్‌‌‌‌ జడ్పీ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌ గండ్ర జ్యోతి శాయంపేటకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం గురించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.