ఎల్బీనగర్, వెలుగు: సెల్లార్ నిర్మించేందుకు గుంత తవ్వుతుండగా పక్కనే ఉన్న గోడ కూలి ముగ్గురు కూలీలు చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లోని చంద్రపురి కాలనీలో బుధవారం చోటు చేసుకున్నది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లికి చెందిన అలకుంట్ల వీరయ్య, రాధమ్మ దంపతుల ఫ్యామిలీ ఆరేండ్ల కింద హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నది.
ఎల్బీనగర్, వనస్థలిపురం లేబర్ అడ్డాల వద్ద ఉంటూ వివిధ ప్రాంతాల్లో జరిగే భవన నిర్మాణ పనులకు వెళ్తుంటది. వీరయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాస్, చిన్న కొడుకు రాము. వీరయ్య బావమరిది కృష్ణ, అతని కొడుకు శ్రీనివాస్ అలియాస్ వాసు కూడా కూలి పనులు చేసుకుంటూ పొట్ట నింపుకునేవాళ్లు. ఎల్బీనగర్ – విజయవాడ నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న చంద్రపురి కాలనీలో అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతున్నది. బిల్డర్.. ఇటీవల డబుల్ సెల్లార్ నిర్మాణ పనులు పూర్తి చేశాడు. మూడు రోజుల కింద సెల్లార్ బాటమ్‌లో పిల్లర్ వర్క్స్ మొదలుపెట్టాడు.
సెల్లార్ అడుగు భాగంలో కొంత మట్టి ఉండిపోవడంతో దాన్ని తొలగించేందుకు వీరయ్య, అతని చిన్న కొడుకు రాము, అల్లుడు వాసు, నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన భిక్షపతిని బిల్డింగ్ కాంట్రాక్టర్ బుధవారం ఉదయం సైట్‌కు తీసుకొచ్చాడు. సెల్లార్ అడుగు భాగంలో నలుగురు కలిసి తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే.. పక్కనే ఉన్న ప్రహరి గోడ కూలిపోయింది. నలుగురు మట్టిలో కూరుకుపోయారు. తోటి కూలీలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తవ్వకాలు చేపట్టారు. గాయపడిన భిక్షపతిని బయటికి తీసి కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు రాము (19), వాసు (17), వీరయ్య (50) సజీవ సమాధి అయ్యారు. వీరి డెడ్‌బాడీలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఎల్బీనగర్, వస్థలిపురం ఏసీపీలు కృష్ణయ్య, కాశిరెడ్డి పరిశీలించారు.
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్ యాదయ్య, కందకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, సరూర్‌నగర్ ఎమ్మార్వో వేణుగోపాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డికి నివేదిక సమర్పించారు. బిల్డింగ్ ఓనర్లు కుసుమ రమేశ్, కుసుమ విజయ్, బిల్డర్ సాయినాథ్.. కనీస నిబంధనలు పాటించకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టడంతోనే ప్రమాదం జరిగిందని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. గతంలోనే వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రౌండ్ పుట్టింగ్ పిల్లర్ల పనులు చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. గోడ చివరి వరకు గ్రీన్ మ్యాట్ లేదంటే జాలి లాంటి సేఫ్టీ గార్డ్స్ ఏర్పాటు చేసి ఉంటే కూలీల ప్రాణాలు పోయేవి కావని తెలిపారు.
ఓనర్లు, బిల్డర్‌పై కేసు నమోదు
మృతుడు వీరయ్య పెద్ద కొడుకు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓనర్లు రమేశ్, విజయ్, బిల్డర్ సాయినాథ్‌పై కేసు నమోదు చేశామని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఓనర్లు, బిల్డర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి సెల్లార్ తవ్వడంతో షోకాజ్ నోటీసులిచ్చామన్నారు. భవన నిర్మాణ అనుమతులు రద్దు చేశామని తెలిపారు. తవ్వకాల టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. జనవరి 16న నోటీసులు జారీ చేసినప్పటికీ ఓనర్లు, బిల్డర్ పట్టించుకోలేదని వివరించారు. అయితే, జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ తెలిపారు.