
- నైట్రోజన్ గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి
- రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలో దారుణం
జైపూర్: రాజస్థాన్‌లో నైట్రోజన్ గ్యాస్ లీకై ముగ్గురు చనిపోయారు. 50 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. బీవర్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పార్క్ చేసిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకైందని అధికారులు గుర్తించారు. మృతుల్లో ఫ్యాక్టరీ ఓనర్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. సునీల్ సింఘాల్ అనే వ్యక్తి బడియాలోని రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లీగల్‌గా కెమికల్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు.
సోమవారం అర్ధరాత్రి దాటాక ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ఫ్యాక్టరీ ఓనర్ సునీల్(47) తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. మరో ఇద్దరు దయారాం (52), నరేంద్ర సోలంకి మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన అధికారులు వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అస్వస్థతకు గురైన 53 మందిని హాస్పిటల్స్‌లో చేర్పించారు. వీరు వాంతులుచేసుకుంటున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్తున్నారని డాక్టర్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిని అజ్మీర్‌లోని జేఎల్ఎన్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.