ఇంట్లో బట్టలు ఉతకాలని తీసుకెళ్లి.. మహిళపై గ్యాంగ్ రేప్

ఇంట్లో బట్టలు ఉతకాలని తీసుకెళ్లి.. మహిళపై గ్యాంగ్ రేప్
  • హైదరాబాద్ లో యూపీ వాసుల దారుణం
  • ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పరారీలో మరో ఇద్దరు నిందితులు

జూబ్లీహిల్స్, వెలుగు: ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ లో ఈ దారుణం జరిగింది. కొండాపూర్​కు చెందిన బాధితురాలు భవన నిర్మాణ పనుల్లో  కూలీగా పనిచేస్తున్నది. సోమవారం పని ముగించుకుని, సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు హైటెక్​ సిటీ క్రాస్​రోడ్డు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నది. ఆ టైంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె వద్ద వాహనం ఆపారు. తమ  ఇంట్లో బట్టలు ఉతకాలని, అందుకు రూ.500 ఇస్తామని చెప్పారు. అది నిజమని నమ్మిన ఆ మహిళ వారితో కలిసి ఆటో ఎక్కింది. ఆ యువకులు రహ్మత్​ నగర్​లోని​ఓం నగర్​లో ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లారు. 

ఆ మహిళ బట్టలు ఉతుకుతుండగా లోపలి నుంచి గడియపెట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. ఈ ఘటనపై రాత్రి 11.30కు బాధితురాలు మధురానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్ పూర్​కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారి అడ్రస్, ఫోన్  నంబర్లు దొరికాయని వెల్లడించారు. వారు ఇక్కడ పెయింటింగ్​ పనులు చేస్తారని, నెల రోజుల క్రితమే ఓంనగర్​లో రూమ్  తీసుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించామని ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​ చెప్పారు.