శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు సాత్విక్ సూసైడ్ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం ఫ్యాకల్టీ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్ పై కేసులు నమోదు చేశామని ఏసీపీ రమణ గౌడ్ చెప్పారు. గతంలో కొంతమంది సిబ్బంది స్టూడెంట్స్ ను క్లాస్ రూమ్ లోనే కొట్టిన వీడియోలపైనా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. 

అసలేం జరిగింది..? 

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య కలకలం రేపింది. నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఎన్. సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు స్వాతిక్ ఫ్రెండ్స్, ఇతర స్టూడెంట్స్ చెప్పారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో కనీసం కాలేజీ సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని, ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదని విద్యార్థులు చెబుతున్నారు. తోటి విద్యార్థులే ఓ వ్యక్తి బైక్ పై దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారని వివరించారు. అయితే.. ఆస్పత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడు. పోస్టుమార్టం కోసం సాత్విక్ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

తల్లిదండ్రులకు గుండెకోత

తమ కుమారుడు సాత్విక్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నార్సింగి చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేవరకూ ఇక్కడ నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. FIR లో చేర్చిన నిందితులను తమ ముందుకు తీసుకురావాలని సాత్విక్ బంధువులు డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. కాలేజ్ యాజమాన్యంతో సాత్విక్ తల్లిదండ్రులను మాట్లాడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్ హామీ  ఇచ్చారు. 

సిబ్బంది వేధింపులు, ఒత్తిళ్లు

మరోవైపు.. కాలేజీ విద్యార్థులను  సిబ్బంది బాగా టార్చర్ పెడుతున్నారని కొంతమంది స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. కాలేజీ క్లాస్ రూమ్ లోనే విద్యార్థులను అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచార్య కొడుతున్న విజువల్స్ బయటికొచ్చాయి. కాలేజీలో కులం పేరుతో దూషించేవాడని, తనకున్న ఆస్తుల గురించి చెబుతూ విద్యార్థులను చిన్నచూపు చూసేవాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కాలేజీ హాస్టల్ ఇన్ చార్జ్ నరేష్ కూడా విద్యార్థులను బూతులు తిడుతూ ఉంటాడని విద్యార్థులు చెబుతున్నారు. 

విద్యార్థి సంఘాల ఆగ్రహం

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రోడ్డుపై బైఠాయించి..NSUI విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. దీంతో దాదాపు2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మరోవైపు.. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆందోళకారులను అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.