సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, బాల్కనీ ఇన్చార్జ్ గంధకం విజయ చందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప2 ప్రీమియర్ షో రోజు థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఈ చర్యలు చేపట్టారు.
ముషీరాబాద్, వెలుగు: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రాజు నాయక్, ఎస్సై మౌనికతో కలిసి చిక్కడపల్లి పోలీస్ డివిజన్ ఏసీపీ రమేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇన్చార్జి గంధకం విజయ చందర్ను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. వారికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారని చెప్పారు.
‘‘థియేటర్ యాజమాన్యం ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. దాంతోపాటు ఆమె కొడుకు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి లోతైన దర్యాప్తు జరిపి ఘటనకు బాధ్యులైన ప్రతిఒక్కరికీ శిక్షపడేలా చేస్తాం. అలాగే, ప్రీమియర్ షో సందర్భంగా సినిమా చూడడానికి వచ్చిన నటుడు అల్లు అర్జున్ కు నోటీసులు జారీచేసే అంశంపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.
ప్రీమియర్ షో సందర్భంగా సాయికిరణ్ అనే వ్యక్తి థియేటర్ లోపలి నుంచి అరవగా మా కానిస్టేబుల్ ఆంజనేయులు, ఎస్సై ప్రసాద్ రెడ్డి, మౌనిక సిబ్బందితో కలిసి రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ్ ను బయటకు తీసుకువచ్చి సీపీఆర్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్పరిస్థితి నిలకడగా ఉంది” అని ఏసీపీ వివరించారు.