- వికారాబాద్‌జిల్లా పూడూరు గేటు వద్ద ప్రమాదం
- మృతుల్లో ఇద్దరు విద్యార్థులు
- లిఫ్ట్ అడిగి ప్రాణాలు కోల్పోయిన స్టూడెంట్లు
పరిగి, వెలుగు: బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు స్టూడెంట్లు ఉన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు గేటు సమీపంలో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పూడూరు మండలంలోని గొంగుపల్లికి చెందిన మిట్టకంకటి ప్రవీణ్ (21) తన అమ్మమ్మ ఊరు మేడికొండకు వెళ్లాడు. మేడికొండకే చెందిన హర్షవర్ధన్ (15) అనంతగిరిపల్లిలోని ఎస్సీ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతుండగా, ఇదే ఊరికి చెందిన చిలుకమర్రి నవీన్ కుమార్ (21) వికారాబాద్‌లోని అనంత పద్మనాభ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
గురువారం పనిమీద ప్రవీణ్ టూ వీలర్‌పై మన్నెగూడ వెళ్తుండగా.. తమను మార్గం మధ్యలో డ్రాప్ చేయాలని నవీన్, హర్షవర్ధన్ కోరారు. ముగ్గురూ కలిసి బైక్ పై వెళ్తుండగా.. మన్నెగూడ నుంచి పరిగి వైపు వెళ్తున్న హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. పూడూరు గేటు సమీపంలో వారి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, హర్షవర్ధన్ అక్కడికక్కడే చనిపోయారు.
తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను పరిగి దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎస్పీ నారాయణ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు.