- బీఆర్ఎస్ క్యాంప్ లో ఇద్దరి మధ్య పోటీ
- తాజాగా తెరపైకి వచ్చిన బీజేపీ
- పావులు కదుపుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
- రసవత్తరంగా బల్దియా పాలిటిక్స్
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నాలుగేండ్ల కింద మెజార్టీ స్థానాలతో చైర్ పర్సన్ సీటు దక్కించుకున్న పండిత్ వినీత, అదే కౌన్సిలర్ల చేతిలో అవిశ్వాసం ఎదుర్కొని ఏడాది ముందే తన పదవిని కోల్పోయ్యారు.
దీంతో ఖాళీ అయిన సీటుపై ఆశావహుల దృష్టి పడింది. నెలరోజుల నుంచి క్యాంప్ రాజకీయాలు నడిపిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, పండిత్ వినీతను పదవి నుంచి దింపే విషయంలో సక్సెస్అయ్యారు.
17 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ మద్దతివ్వడంతో అవిశ్వాసం నెగ్గింది. చైర్ పర్సన్ పదవిని దక్కించుకునేందుకు 19 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం కాగా, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి క్యాంప్‌లో 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మిగతా బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్లను తమ గూటికే రప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
సీల్డ్కవరే ఫైనల్..
బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఖాందేశ్ శ్రీనివాస్ భార్య, 2వ వార్డు కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత, అయ్యప్ప ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీనివాస్ భార్య, 23వ వార్డు కౌన్సిలర్ వన్నెల్ దేవి లావణ్య చైర్ పర్సన్ రేసులో ఉన్నారు. పదవిని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖాందేశ్ సంగీత గతంలోనూ చైర్పర్సన్ పదవి ఆశించగా, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పండిత్ వినీతకు ఛాన్స్దక్కింది. ఇప్పుడు ఆ పదవి ఖాళీ అవ్వడంతో తనకు చైర్ పర్సన్ ఇవ్వాలని సంగీత కోరుతున్నారు.
పార్టీకి నమ్మకంగా పనిచేసి, క్యాడర్ అభివృద్ధికి కృషి చేసినందున తమకు ఛాన్స్ఇవ్వాలంటూ వన్నెల్ దేవి లావణ్య, ఆమె భర్త అయ్యప్ప శ్రీనివాస్ కోరుతున్నారు. చైర్పర్సన్పదవి కోసం ఇద్దరు పోటీ పడుతుండడంతో మాజీ ఎమ్మెల్యే డైలామాలో పడ్డారు. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు మాత్రం ఇద్దరిలో తమకు నచ్చిన ఒకరి పేరు రాసిస్తామని, ఆ కవర్ ను జీవన్‌రెడ్డికి ఇస్తామని చెప్పారు. సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వచ్చినా కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఎంట్రీతో తెరపైకి బీజేపీ..
మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కామెంట్‌తో చైర్ పర్సన్ సీటుపై బీజేపీ సైతం కన్నేసినట్లు స్పష్టమవుతోంది. అవిశ్వాసం నేపథ్యంలో చైర్ పర్సన్ పండిత్ వినీతను తప్పించేందుకు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పావులు కదిపి ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను ఒప్పించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయించారు.
అవినీతి అంతం కోసమే తాము పండిత్ వినీతను తప్పించామని, త్వరలో జరిగే ఎన్నికల్లో తామే చైర్ పర్సన్ సీటును దక్కించుకుంటామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ భార్య ఆకుల సంగీతను బరిలో దింపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్ పర్సన్ సీటును దక్కించుకోవాలని ఆ పార్టీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికకు ముహూర్తం ఎప్పుడో..
చైర్పర్సన్ వినీతపై అవిశ్వాసం నెగ్గడంతో ఆర్డీవో కలెక్టర్ కు నివేదించారు. ఆ నివేదిక కలెక్టర్ నుంచి సీడీఎంఏకు వెళ్తుంది. వారు కొత్త చైర్ పర్సన్ ఎన్నికకు తేదీని ఖరారు చేస్తారు. చైర్పర్సన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఇన్చార్జి చైర్ పర్సన్ ను ఎన్నుకోవాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఇన్చార్జి చైర్ పర్సన్ గా ఎవరిని నియమిస్తారనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కలెక్టర్ కు ఫిర్యాదు?
అవిశ్వాసం నిర్వహించిన విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని చైర్ పర్సన్ పండిత్ వినీత రెండు రోజుల కింద కలెక్టర్రాజీవ్గాంధీ హన్మంతును కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆమె హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.