కాస్ట్లీ బైకులు కొట్టేస్తున్న ముగ్గురు అరెస్ట్​

కాస్ట్లీ బైకులు కొట్టేస్తున్న ముగ్గురు అరెస్ట్​

కామారెడ్డి టౌన్, వెలుగు: కాస్ట్లీ బైకులను కొట్టేస్తున్న ముగ్గురిని కామారెడ్డి టౌన్​పోలీసులు అరెస్ట్​చేశారు. రూ.40 లక్షల విలువైన 29 బైకులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కామారెడ్డి టౌన్​పీఎస్​లో ఎస్పీ సింధూశర్మ మీడియాకు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా కాస్ట్లీ బైకులు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో డీఎస్పీ ప్రకాశ్​పర్యవేక్షణలో టౌన్​సీఐ చంద్రశేఖర్​రెడ్డి, సీసీఎస్​సీఐ, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు మొదలుపెట్టారు.

గురువారం కామారెడ్డిలోని నిజాంసాగర్​చౌరస్తాలో వెహికల్స్​తనిఖీ చేస్తుండగా, అదే టైంలో అటుగా బైక్​పై వచ్చిన ముగ్గురు అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీయగా బైకులు చోరీ చేస్తున్నట్లు తేలింది. నిజామాబాద్​జిల్లా మాక్లూర్​మండలం బొంకన్​పల్లికి చెందిన శశాంక్, ఎరుగట్ల సందీప్, మాక్లుర్​కు చెందిన షేక్​అహ్మద్ గా గుర్తించారు.

ముగ్గురూ కలిసి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్​జిల్లాలోని ఆయా పోలీస్​స్టేషన్ల పరిధిలో బైకులు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. 29 బైక్​లు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన టౌన్ సీఐ చంద్రశేఖర్​రెడ్డి, సీసీఎస్​సీఐ మల్లేశ్​గౌడ్, ఎస్సైలు ఉస్మాన్, శ్రీరామ్, ఏఎస్సై రాజేశ్వర్, సురేందర్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.