నకిలీ డాక్యుమెంట్లతో బురిడి కొట్టించబోయి..జైలు పాలైన ముగ్గురు కేటుగాళ్లు

నకిలీ డాక్యుమెంట్లతో బురిడి కొట్టించబోయి..జైలు పాలైన ముగ్గురు కేటుగాళ్లు

జోగిపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఆందోల్​లో నకిలీ డాక్యుమెంట్లతో రిటైర్డ్​ ఐపీఎస్​ఆఫీసర్ కు సంబంధించిన భూమిని అమ్మే ప్రయత్నం చేసిన ముగ్గురు కేటుగాళ్లు జైలుపాలయ్యారు. బుధవారం సీఐ అనిల్​కుమార్​దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నారాయణ్​ఖేడ్​ ప్రాంతానికి చెందిన రవీందర్, సుధాకర్, ర్యాకల్​గ్రామానికి చెందిన రియల్​ఎస్టేట్​ వ్యాపారి సంజీవరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్​ అగ్రిమెంట్​డాక్యుమెంట్స్​సృష్టించారు. ఆందోల్​ గ్రామానికి చెందిన రిటైర్డ్​ ఐపీఎస్​అధికారి శేరి ప్రభాకర్​రెడ్డి, తన బంధువులు శేరి నర్సింహరెడ్డి, బాలకృష్ణారెడ్డి, అంజమ్మలకు సంబంధించిన

 57.12 ఎరకాలకు సంబంధించి పట్టాపాస్​బుక్కులు,  ఆధార్​కార్డులు వాట్సప్​ ద్వారా సంపాదించారు. వాటిని ప్రింట్​తీపించి బాండ్​ పేపర్​పై అగ్రిమెంట్​ చేసుకున్నట్లు రూ.22.23 కోట్లకు  ఒప్పందం చేసుకొని అడ్వాన్స్​గా రూ.2కోట్లు ఇచ్చినట్లు ఫేక్​ రశీదు ​సృష్టించారు. వీటిని ఆధారం చేసుకొని రవీందర్​హైదరాబాద్​కు చెందిన బిల్డర్​ యాదగిరిరెడ్డికి భూమి అమ్మే ప్రయత్నం చేశారు. మే 3న గాజులరామారంలోని యాదగిరిరెడ్డితో  ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరాకు రూ.40 లక్షలకు ఫైనల్​కాగా అదే రోజు అడ్వాన్స్​గా రూ.11 లక్షలు యాదగిరిరెడ్డి వారి బంధువుల  ద్వారా సంజీవరెడ్డి అకౌంట్​కి ట్రాన్స్​ఫర్​ చేశారు.

అప్పటి నుంచి ముగ్గురు తప్పించుకు తిరుగుతున్నారు. రెండు నెలలు గడుస్తున్నా అగ్రిమెంట్ గడువు ముగుస్తున్నా  భూమి చూపించకపోవడంతో యాదగిరిరెడ్డికి అనుమానం వచ్చి నేరుగా ఆందోల్​కు చేరుకొని భూమి యజమాని గురించి ఆరా తీశాడు. దీంతో తాము ఎవరికి అగ్రిమెంట్​ చేయలేదని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించాడు. జరిగిన విషయం యాదగిరిరెడ్డి, నర్సింహరెడ్డికి వివరించాడు. ఈ మేరకు నర్సింహరెడ్డి ఈనెల 6న జోగిపేట పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంజీవరెడ్డి, రవీందర్, సుధాకర్​ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.