వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన ఎండీ.రషీద్ (35) వేములవాడలోని సాయినగర్‌లో ఉంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన నూనె మనోహర్ అప్పుడప్పుడు గల్ఫ్‌కు వెళ్లి వస్తుంటాడు.
ఇతడు ఫ్యామిలీతో కలిసి కొన్నాళ్ల కింద వేములవాడ పట్టణంలోని సాయినగర్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఈ క్రమంలో మనోహర్ భార్య మంజులకు, రషీద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరగడంతో పాటు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దీంతో మంజుల వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది.
ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన మనోహర్ బుధవారం తెల్లవారుజామున తన భార్య ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లగా మంజుల, రషీద్ ఏకాంతంగా కనిపించారు. మనోహర్‌ను చూసిన రషీద్ పారిపోతుండగా వెంటపడి కత్తితో పొడిచాడు. దీంతో రషీద్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి సీఐ శ్రీనివాస్ తెలిపారు.
మద్యం మత్తులో యువకుడు..
ఖిలా వరంగల్/కరీమాబాద్, వెలుగు: మద్యం మత్తులో ఓ వ్యక్తి యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోట ఏరియాలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని కగారియా ప్రాంతానికి దిల్‌కుష్ కుమార్ (18) ఎస్‌ఆర్‌ఎస్ తోట ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని అన్నతో కలిసి ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ బార్ షాపుకు వెళ్లి మద్యం సేవిస్తుండగా, అదే ఏరియాకు చెందిన బానోత్ నాగేశ్‌తో గొడవ జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్ రాత్రి 10 గంటల టైంలో దిల్‌కుష్‌కుమార్ ఇంటికి వెళ్లి ఇనుప రాడ్, పైపులతో కొట్టాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు దిల్‌కుష్‌కుమార్ అన్న వచ్చి చూసేసరికే చనిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్ కాలనీ సీఐ జూపల్లి వెంకటరత్నం ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
తాగి వేధిస్తున్నాడని యువకుడిని చంపిన తల్లి, భార్య
కొడిమ్యాల, వెలుగు: తాగి వేధిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని అతడి తల్లి, భార్య కలిసి హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పెద్ది రాజశేఖర్ (35) మద్యానికి బానిసై తరచూ భార్య నిర్మలను, తల్లి కొమురవ్వను వేధించాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చిన రాజశేఖర్ మరోసారి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. దీంతో విసిగిపోయిన వారు కర్రతో కొట్టి హత్య చేసి బాత్రూమ్‌లో పడేశారు. బుధవారం ఉదయం గమనించిన మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ నీలం రవి, ఎస్సై సందీప్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.