- బేగంబజార్‌లో ఎలక్ట్రీషియన్ హత్య
- ఎస్సార్‌నగర్‌లో తాగిన మత్తులో రూమ్ మేట్‌ను చంపిన సహచరుడు
- మైలార్దేవ్ పల్లిలో తండ్రిని హత్య చేసిన కొడుకు
బషీర్ బాగ్/పంజాగుట్ట/శంషాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి ముగ్గురు హత్యకు గురయ్యారు. బేగంబజార్, ఎస్సార్ నగర్, మైలార్ దేవ్ పల్లిలో ఈ మర్డర్లు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్ పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అజీమ్ (72) ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. బేగంబజార్ లోని ఫీల్ ఖానాలో షాపు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం తన దుకాణానికి వెళ్లాడు. అయితే, రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అజీమ్ కొడుకు తన తండ్రి మొబైల్ కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఉదయం షాప్ కు వెళ్లి చూడగా అజీమ్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే కొడుకు బేగంబజార్ పోలీసులకు సమాచారం అందించాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సార్ నగర్ లో తాగిన మత్తులో రూమ్మేట్ను సహచరుడు హత్యచేశాడు. కర్నూలు జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన వెంకటరమణ (30), ఏలూరుకు చెందిన గణేశ్ (28) హాస్టల్ లోని ఒకే గదిలో ఉంటున్నారు. వారు ఉంటున్న రూంలోనే అజయ్, కేశవ సింగ్ అనే వ్యక్తులు కూడా ఉంటున్నారు. వెంకటరమణ ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుండగా, గణేశ్.. సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. గణేశ్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ రాత్రి తాగి వచ్చి రూమ్ తలుపు కొడుతూ పడుకున్నవారికి ఇబ్బంది కలిగిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా తాగి వచ్చాడు. అదేపనిగాడోర్ కొట్టడంతో వెంకటరమణ కోపగించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇంతలో గణేశ్.. సెలూన్ షాపులో వినియోగించే కత్తితో వెంకటరమణపై దాడిచేశాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. హత్యచేసిన తర్వాత గణేశ్ పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
తండ్రిని హత్య చేసిన కొడుకు
మైలార్ దేవ్ పల్లిలో తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడు. కర్నాటకకు చెందిన ముదిరాజ్ కిష్టప్ప తన కుటుంబంతో కలిసి పదేండ్ల క్రితం మైలార్ దేవ్ పల్లికి వలస వచ్చాడు. ప్రగతి నగర్ లో నివాసముంటున్నాడు. శనివారం రాత్రి తండ్రీకొడుకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కొడుకు మహేందర్ (23).. తండ్రి కిష్టప్ప (52) పై దాడిచేశాడు. తలకు బలమైన గాయం కావడంతో కిష్టప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.