ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌లపై వేటు .. ఎందుకంటే

ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌లపై వేటు .. ఎందుకంటే

ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులపై వేటు వేసింది. ప్రస్తుతం వెయిటింగ్‌లో వున్న మాజీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్ఆర్‌ ఆంజనేయులు, మాజీ విజయవాడ సిటీ పోలీస్‌కమిషనర్‌ కాంతిరాణా టాటా, మాజీ విజయవాడ డిసిపి విశాల్‌ గున్నిను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జిఓ    విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఎసిపి హనుమంతరావులను సస్పెండ్‌ చేశారు. 

తనపై  తప్పుడు ఫిర్యాదు ఆధారంగా  అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్ఆర్‌ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారులపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై విచారణకు డిజిపి తిరుమల రావు ఆదేశించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు జరిపిన విచారణలో ఈ వ్యవహరంలో అనేక లొసుగులు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయన నివేదిక రూపొందించి డీజీపీకి అందజేశారు. దీని ఆధారంగా డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉన్నతస్థాయిలో ఉన్న ఐపిఎస్‌ అధికారులు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో వివరించారు. నటి జెత్వానిని వేధించి అక్రమంగా అరెస్ట్‌ చేసిన కేసులో మొత్తం 15 మంది పోలీస్‌ అధికారులు వున్నట్లు వివరించింది.