తుమ్మిడిహెట్టికి మూడు ప్రపోజల్స్​!

తుమ్మిడిహెట్టికి మూడు ప్రపోజల్స్​!
  • పాత డిజైన్​ ప్రకారమే ముందుకెళ్లాలన్నది ఫస్ట్​ ప్లాన్
  • ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కాలువలు పూర్తి.. త్వరగా నీళ్లివ్వొచ్చని భావన
  • రెండో మార్గంగా ఎత్తు తగ్గించి.. వానా కాలంలో ఎత్తిపోసుకోవాలనే ఆలోచన 
  • ఎత్తుపై మహారాష్ట్ర సర్కారుతో ఏప్రిల్​లో సమావేశానికి ఏర్పాట్లు
  • ఇది కుదరకుంటే మూడో మార్గంగా తుమ్మిడిహెట్టితోపాటు వార్ధా నిర్మాణం
  • ఆ రెండింటినీ లింక్​ చేసి నీటిని తీసుకోవాలనే యోచన

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పక్కనపెట్టిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే తుమ్మడిహెట్టిపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి  ప్రకటన కూడా చేశారు. ఇంతకుముందు కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన పాత డిజైన్ల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టంచేశారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పాత డిజైన్ల ప్రకారం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందుకే ఈ ప్లాన్​తోపాటు మరో రెండింటినీ పరిశీలిస్తున్నారు. 

తుమ్మిడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర సర్కారుతో ఏప్రిల్​లో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎత్తుపై ఆ రాష్ట్రం పేచీ పెడ్తే తమ ముందు ఉన్న 2  ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి ఎత్తును తగ్గించుకొని వర్షాకాలంలో తుమ్మిడిహెట్టి, ఎండా కాలంలో మేడిగడ్డను వాడుకోవడం అందులో ఒకటి కాగా, తుమ్మడిహెట్టితోపాటు వార్ధాను నిర్మించడం మరొకటి. ఈ మూడు ప్లాన్లపై ఇరిగేషన్​ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నది.

మహారాష్ట్రతోనే తంటాలు..

ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్​సర్కారు 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదు. తమ భూభాగంలోని 1,850 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని డిమాండ్​ చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్​ ప్రభుత్వం మహారాష్ట్ర డిమాండ్​కు అంగీకరించింది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని సంతకాలు కూడా చేశాయి. 

కానీ, 2016లో కేసీఆర్​ ఆ ప్రాజెక్టును కాళేశ్వరం కోసం అర్ధంతరంగా ఆపేశారు. ప్రస్తుతం కాంగ్రెస్​ సర్కారు మళ్లీ ఆ ప్రాజెక్టును ఉమ్మడి ఏపీలో తలపెట్టిన పాత ఎత్తుతోనే నిర్మించాలని భావిస్తున్నది. అందుకు మహారాష్ట్రతో ఏప్రిల్​లో సంప్రదింపులు జరిపేందుకూ కసరత్తు చేస్తున్నది. ఒకవేళ ముందు అనుకున్న 152 మీటర్లకు మహారాష్ట్ర  ఒప్పుకోకుండా.. 148 మీటర్ల ఎత్తుతోనే ప్రాజెక్టును నిర్మించాలంటే.. అక్కడి నీటి లభ్యత ఆధారంగా ముందుకు వెళ్లేందుకు యోచిస్తున్నది. 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే.. వర్షాకాలంలో తుమ్మిడిహెట్టి వద్ద నుంచి నీటిని వాడుకుని, ఎండాకాలంలో మాత్రం మేడిగడ్డ నుంచి తీసుకుంటే ఎట్ల ఉంటుందన్న ప్రణాళికలపైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

వార్ధా, తుమ్మిడిహెట్టి రెండూ కడితే..

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన గత బీఆర్ఎస్​ సర్కారు.. తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కకుపెట్టేసి కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా నదిపై బ్యారేజీని (వార్ధా) నిర్మించాలని నిర్ణయించింది. 2020, 2021లో డీపీఆర్​ కోసం సర్వేలూ చేయించింది. రూ.750 కోట్లతోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ముందు చెప్పిన గత ప్రభుత్వం.. ఆ తర్వాత 2022లో ఆ అంచనాలను అమాంతం రూ.4,550 కోట్లకు పెంచేసింది. 

32 టీఎంసీల నీటిని వాడుకునేలా బ్యారేజీని నిర్మించాలని భావించింది. బ్యారేజీలో భాగంగా 20 కిలోమీటర్ల మేర కాలువను తవ్వాలని నిర్ణయించింది. ఆ కాలువను తుమ్మిడిహెట్టి దిగువన కుడిమెట్టిగూడెం వద్ద ఇప్పటికే తవ్విన కాలువకు అనుసంధానించి 1.5 టీఎంసీల నీటిని నిల్వచేసుకునేలా రిజర్వాయర్​ను నిర్మించాలని భావించింది. కానీ, ఆ ప్రాజెక్టు అటకెక్కింది. మహారాష్ట్ర అభ్యంతరాలు, ముంపు సమస్య తేలకపోవడంతో డీపీఆర్​ను సీడబ్ల్యూసీ వెనక్కు పంపించింది. 

ప్రస్తుతం తుమ్మిడిహెట్టిని రివైవ్​ చేయాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. తుమ్మిడిహెట్టితో పాటు వార్ధానూ నిర్మించి ఆ రెండింటిని లింక్​ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలపైనా అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. వార్ధా ద్వారా ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాల్లోని 1.34 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు వీలవుతుందని అంటున్నారు. వార్ధా, తుమ్మిడిహెట్టి రెండు ప్రాజెక్టులను కట్టి లింక్​ చేయడం ద్వారా పాత, కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూడు ప్లాన్లలో చివరకు సర్కారు దేనిని వర్కవుట్​ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

తుమ్మిడిహెట్టి వద్ద కడితే..

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపైనే కాంగ్రెస్​ సర్కారు ఆదినుంచీ ఫోకస్​ పెట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్​ హయాంలో 2008లో తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీలను ఎత్తిపోసేలా చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించి 71.5 కిలోమీటర్ల మేర మైలారం వరకు కాలువలు అందుబాటులో ఉండడంతో.. గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించొచ్చనే ఆలోచనతో ఉంది. 

దాంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించాక.. అక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే పాత ఆలోచననూ తెరపైకి తీసుకొస్తున్నది. ఒకవేళ అదనపు ఖర్చు అనుకుంటే.. మైలారం నుంచే నేరుగా సుందిళ్లకు గ్రావిటీ ద్వారా తరలించి.. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు నీటిని తరలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని 2.5 లక్షల ఎకరాలుసహా 7 జిల్లాల్లోని 16.4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నది.