ఒకే గ్రామంలో ముగ్గురికి గ్రూప్ 4 ఉద్యోగాలు

ఒకే గ్రామంలో ముగ్గురికి గ్రూప్ 4 ఉద్యోగాలు
  • మక్తల్ మండలం కర్ణిలో సత్తా చాటిన యువత 
  • ముగ్గురికీ ఓపెన్ కేటగిరీలోనే ఉద్యోగాలు 

మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ణి గ్రామానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యారు. తమ గ్రామానికి చెందిన యువత సర్కారు కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.  పట్టుదలతో కష్టపడి చదివి ముగ్గురు కూడా ఓపెన్ కేటగిరీలోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు వారికి అభినందనలు తెలిపారు.   

భర్త ప్రోత్సాహంతో..

గ్రూప్ 4 రిక్రూట్మెంట్ లో కర్ణి గ్రామానికి చెందిన బి. నందిని మైనారిటీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక అయింది. భర్త రాజీవ్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను కష్టపడి చదివి విజయం సాధించానని ఆమె తెలిపింది. బీటెక్ పూర్తి చేసిన తాను గతంలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జాంలో 1:3 లిస్టుకు ఎంపికయ్యానని, కానీ చివరలో జాబ్ మిస్ అయిందని వెల్లడించింది. తాజాగా పట్టుదలతో చదివి గ్రూప్ 4 జాబ్ సాధించానని సంతోషం వ్యక్తం చేసింది.   

కానిస్టేబుల్ గా ఎంపికై.. 

గ్రామానికి చెందిన రైతు బిడ్డ భాస్కర్ రెడ్డి గత సంవత్సరం నారాయణపేట జిల్లా ఓపెన్ కేటగిరీలో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. ఎస్ఐ ఎగ్జాంలోనూ మంచి మార్కులు సాధించినా, చివరలో జాబ్ కోల్పోయాడు. తాజాగా విడుదలైన గ్రూప్ 4 ఫలితాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ ట్రైనింగ్ లో కొనసాగుతున్న అతడు ఇటు గ్రూప్ 4 కూడా సాధించడం విశేషం.  

విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా.. 

ఇదే గ్రామానికి చెందిన బి. కల్యాణ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. తన తల్లి దండ్రులు బి. ఉమా మహేశ్వరి,  బి. శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయం చేస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే కష్టపడి చదివి గ్రూప్ 4లో విజయం సాధించానని అతడు చెప్పాడు. తాను బీటెక్ పూర్తి చేశానని, ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్​ కూడా రాసి, రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు.