- కొరడా ఝళిపించిన ఆర్టీఏ అధికారులు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు, గత మూడు రోజుల నుంచి ఆర్టీఏ అధికారులు స్కూలు బస్సుల తనిఖీలు చేపట్టారు. బడులు ప్రారంభం కావడంతో రవాణా శాఖ స్కూల్ బస్సుల తనిఖీలను ముమ్మరం చేసింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు, వినాయక్ నగర్, ఆర్య నగర్ పులాంగ్ చౌరస్తాలో ప్రైవేటు స్కూలు బస్సులను పరిశీలించారు. ఫిట్ నెస్ తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ లేని మూడు బస్సులను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల, డీటీఓ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్ బస్సులను విధిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ ఇతర సమస్యలు తమ దృష్టికి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా మండల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠశాలల యజమాన్యాలు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.