- సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో ముగ్గురు స్కూల్ పిల్లల కిడ్నాప్‌యత్నం కలకలం సృష్టించింది. తన ఇద్దరి తమ్ముళ్లను తీసుకొని అక్క స్కూల్‌కు వెళ్తుండగా ఓ ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. పోలీసులు సకాలంలో స్పందించి చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు. వీరు కూడా మరో ఆటో డ్రైవర్ పిల్లలు కావడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. కొండాపూర్ మజీద్‌బండలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్‌కు కుమార్తె(14), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటికి సమీపంలోనే ఉన్న ప్రభుత్వ బడిలో వీరు చదువుకుంటూ రోజూ నడుచుకుంటూ వెళ్తున్నారు.
బుధవారం ఉదయం 8.30 ప్రాంతంలో తన ఇద్దరు తమ్ముళ్లను తీసుకొని చిన్నారి పాఠశాలకు వెళ్తుండగా, అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కిరణ్ ముసాద ప్రసాద్(35) వీరిని ఆటోలో దింపుతానని ఎక్కించున్నాడు. ఆపై పాఠశాల వైపు వెళ్లకుండా గుల్మోహర్ పార్కు కాలనీ వైపు వచ్చాడు. వీరిని చూసిన మరో ఆటోడ్రైవర్ సాంబయ్య అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో అప్రమత్తమైన చందానగర్ పోలీసులు చిన్నారులు వెళ్తున్న ఆటోను వెంబడించి ఉదయం 10 గంటల సమయంలో పట్టుకున్నారు. అనంతరం పిల్లల వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అందించారు. ఘటన గచ్చిబౌలి లిమిట్స్‌లో జరగడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిరణ్ అసలు చిన్నారులను ఎందుకు కిడ్నాప్ చేశాడని
ఆరా తీస్తున్నారు.